Samsung Battery 9 Minute Full Charge : ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందేమో అని ఛార్జింగ్ స్టేషన్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈవీల్లో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఇది. ఎక్కడికైనా ఈవీ వాహనంలో వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్లాలి? తమ బ్యాటరీ ఛార్జింగ్ అంత దూరం వస్తుందా? బ్యాటరీ ఖాళీ అయితే దార్లో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ చూసుకున్నాకే ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. అదే పెట్రోలు, డీజిల్ వేరియంట్ వాహనాల విషయంలో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయి. కానీ విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు విస్తరించకపోవడం, బ్యాటరీల ఛార్జింగ్‌కు చాలా సమయం పడుతుండడం పెద్ద సవాల్‌గా మారాయి. అలాగే ఈవీ ఛార్జింగ్ అయిపోతే, స్టేషన్‌కు వెళ్లి వాహనాన్ని నిలిపి అరగంట, గంట సేపు కూర్చోవడం సమస్యగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 600 మైళ్ల (సుమారు 965 కిలోమీటర్లు)కు పైగా ప్రయాణించే విద్యుత్తు వాహన(ఈవీ) బ్యాటరీని కొరియా కంపెనీ శాంసంగ్ ఆవిష్కరించింది. భిన్న రూపాల్లో, అన్ని పరిమాణాల్లో లభించే ఈ బ్యాటరీని కారు/ఎస్యూవీ, ట్రక్కు, బస్సు ఇలా ఏ వాహనంలో అయినా వాడుకోవచచ్చు. శాంసంగ్ కంపెనీలోని బ్యాటరీ విభాగమైన శాంసంగ్ ఎస్డీఐ దీన్ని రూపొందించింది. దీంతో ఈవీ వాహనదారులకు చాలా ఉపశమనం కలగనుంది. ఎందుకంటే ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 965 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీంతో వాహనదారులు ఎటువంటి బెంగ లేకుండా ప్రయాణం చేయవచ్చు.
ఈ బ్యాటరీ స్పెషాలిటీ ఇదే
శాంసంగ్ కంపెనీ తయారుచేసిన ఈ బ్యాటరీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీ 20 ఏళ్ల వరకు పనిచేస్తుందని సంస్థ అంటోంది. ఈ బ్యాటరీని శాంసంగ్ ఆరు నెలలుగా పరీక్షిస్తోంది. హ్యుందాయ్, జనరల్ మోటార్స్ తదితర కంపెనీల వాహనాల్లో బ్యాటరీని అమర్చి విస్తృత పరీక్షలు నిర్వహించింది. దీన్ని 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నది శాంసంగ్ కంపెనీ ప్రణాళిక వేసుకుంది. కాకపోతే ఈ బ్యాటరీ ధర ఎక్కువని సమాచారం. అందుకే తొలిదశలో సూపర్ ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ బ్యాటరీని వాడుతారని తెలుస్తోంది.
బైక్ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే! ధర ఎంతో తెలుసా? - Top 10 Upcoming Bikes