Road Trip Essentials : చాలా మంది కారులో లాంగ్ రోడ్ ట్రిప్ వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే కారులో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మీరు సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతారు. మంచి అనుభూతులను పొందగలుగుతారు. అందుకే లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు మీ కారులో కచ్చితంగా ఓ 6 వస్తువులు ఉంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. ప్రథమ చికిత్స సామగ్రి
మీ వాహనంలో కచ్చితంగా ప్రథమ చికిత్స బాక్స్ (ఫస్ట్ ఎయిడ్ బాక్స్) ఉండాలి. అందులో ప్రాథమిక వైద్యానికి సంబంధించిన సామగ్రి అంతా ఉండేలా చూసుకోవాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే, అత్యవసరంగా చికిత్స అందించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
2. ఎయిర్ కంప్రెసర్
లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు కారు సక్రమంగా ఉందో, లేదో చూసుకోవాలి. ముఖ్యంగా కారు టైర్లలో సరిపడా గాలి ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే, టైర్లలో గాలి తగ్గితే, ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. కొన్ని సార్లు కార్లు పంక్చర్ అవుతాయి. అలాంటప్పుడు రిపేర్ చేయిద్దామన్నా, కొన్ని ప్రాంతాల్లో మెకానిక్‌లు కూడా దొరికరు. అందుకే ఒక ఎయిర్ కంప్రెసర్‌ను మీతోపాటు తీసుకెళ్లడం మంచిది.
3. పంక్చర్ రిపేర్ కిట్
సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు పలు కారణాల వల్ల టైర్లు పంక్చర్లు అవడం కామన్. ఒక వేళ అలా అయితే జర్నీ ఆలస్యమవుతుంది. జనావాసాలు లేని ప్రాంతాల్లో పంక్చర్ అయితే ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే కారులో ఎప్పుడూ పంక్చర్ రిపేర్ కిట్ ఉంచుకోవాలి. అప్పుడే టైరుకు అనుకోకుండా ఏమైనా జరిగినా, రిపేర్ చేసుకుని హాయిగా ప్రయాణం కొనసాగించవచ్చు.
4. రేడియో కమ్యూనికేషన్ పరికరం
మొబైల్ నెట్వర్క్ కవరేజీ లేని ప్రాంతాల్లో లేదా పరిమితంగా ఉండే ప్రాంతాల్లో అత్యవసర కమ్యూనికేషన్ కోసం పోర్టబుల్ రేడియో పరికరం లేదా వాకీ-టాకీ ఉపయోగపడతాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. వీటి ద్వారా 5 కిలో మీటర్ల దూరం వరకు కమ్యూనికేట్ చేసే అవకాశముంటుంది. అందుకే లాంగ్ జర్నీలు చేసేటప్పుడు వీటిని కూడా మీ వెంట తీసుకెళ్లడం మంచిది.
5. గట్టితాడు లేదా టౌ స్ట్రాప్ ఉంటుకోవాలి.
కొన్నిసార్లు కార్లు బురదలో లేదా ఇసుకలో ఇరుక్కుపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో దానిని బయటకు లాగడానికి ఒక గట్టి తాడు ఉంటే, పని చాలా తేలిక అవుతుంది. అందుకే కారులో కచ్చితంగా గట్టి తాడు లేదా టౌ స్ట్రాప్ ఉంచుకోవాలి.
6. ఒక జత జంపర్ కేబుల్స్
లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాటరీ సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బ్యాటరీ సంబంధిత సమస్యలకు జంపర్ కేబుల్స్ చాలా అవసరం. అందుకే మీ కారులో ఒక జంట జంపర్ కేబుల్స్ క్యారీ చేయడం మంచిది. దీని వల్ల మీ బ్యాటరీ డెడ్ అయినప్పుడు మీ వాహనాన్ని జంప్-స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ సమస్య ఎదుర్కొనే ఇతర వాహనదారులకు సాయం చేయవచ్చు.
స్టన్నింగ్ డిజైన్‌తో బజాజ్ పల్సర్ NS400Z బైక్ లాంఛ్ - ధర ఎంతంటే? - Bajaj Pulsar NS400Z
కార్ పెయింట్ కాపాడుకోవాలా? ఈ టిప్స్ మీ కోసమే! - car painting protection