Paytm Shares Plunge : పేటీఎం షేర్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి. మంగళవారం పేటీఎం (వన్97 కమ్యునికేషన్స్) షేర్లు 9 శాతానికి పైగా పడిపోయాయి. ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై ఆంక్షలు విధించినప్పటి నుంచి షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఒకట్రెండు రోజులు పేటీఎం స్టాక్స్ పుంజుకున్నట్లు కనిపించినా, మరలా నష్టాల ఊబిలోకే దిగజారాయి. దీనంతటికీ కారణం ఏమిటి?
నమ్మలేని నిజాలు
పేటీఎం బ్యాంకులో వందలాది నకిలీ ఖాతాలు ఉన్నట్లుగా ఆర్బీఐ గుర్తించింది. ఆర్బీఐ చేపట్టిన ఆడిటింగ్‌లో, ఒకే పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్ కార్డ్)తో వెయ్యికిపైగా పేటీఎం ఖాతాలు లింక్ అయినట్లుగా తేలింది. అంతేకాదు పేటీఎం సమర్పించిన ఆడిటింగ్ రిపోర్టు కూడా తప్పులతడకగా ఉన్నట్లు తెలిసింది. కేవైసీ సరిపోలని చాలా ఖాతాల నుంచి కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు స్పష్టమైంది. దీనితో ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధించింది. మనీలాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చనే ఉద్దేశంతో, పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిలో అక్రమ కార్యకాలాపాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే, ఈడీ దర్యాప్తు కూడా చేపట్టే అవకాశం ఉంది.
ఆర్థిక ఆంక్షలు
పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఆడిటింగ్‌లో అనేక అవకతవకలు ఉండడంవల్ల ఆర్బీఐ సదరు బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. 2024 ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు తమ ఖాతాదారుల నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదని స్పష్టం చేసింది. అలాగే వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులకు టాప్అప్లు చేయకూడదని, వాటి ద్వారా క్రెడిట్ లావాదేవీలు కూడా నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
షేర్ల పతనం
ఆర్బీఐ ఈ విధమైన ఆంక్షలు విధించడం వల్ల పేటీఎం (వన్97 కమ్యునికేషన్ షేర్లు) భారీగా పతనం కావడం మొదలైంది. వరుసగా మూడు రోజులపాటు 20% చొప్పున నష్టపోయాయి. ఆ తరువాత ముకేశ్ అంబానీ పేటీఎంను టేకోవర్ చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పేటీఎంను రక్షించడానికి ముందుకు వస్తుందని అందరూ భావించారు. కానీ ఇవేవీ జరగలేదు. ఎస్బీఐ తమకు పేటీఎం బ్యాంక్ గురించి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ముకేశ్ అంబానీ కూడా తాము పేటీఎంను కొనుగోలు చేయడం గురించి ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు. దీనితో స్టాక్స్ పతనం మళ్లీ ప్రారంభమైంది.
ఫలించని విజయ్ శేఖర్ శర్మ ప్రయత్నాలు
కష్టాల్లో ఉన్న పేటీఎం పేమెంట్ బ్యాంకును ఒడ్డుకు చేర్చేందుకు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన విజయ్ శేఖర్ శర్మ ఎంతో ప్రయత్నించారు. నేరుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ఆర్బీఐ ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
దీనితో విజయ్ శేఖర్ శర్మ బ్యాంకులతో సంప్రదింపులు జరిపారు. పేటీఎం బ్యాంక్ ఖాతాలను వివిధ బ్యాంకులకు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ దీనికి ఏ బ్యాంకు కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయి స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఆర్బీఐ ప్రతీకారం!
పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఆర్బీఐ ప్రతీకార చర్యలు తీసుకుంటోందా? అని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, 'మేము ఏ ఫిన్‌టెక్ కంపెనీకీ వ్యతిరేకం కాదు. కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడడమే మా ప్రధాన లక్ష్యం. అందువల్ల పేటీఎం బ్యాంక్‌పై విచారణ కొనసాగుతుంది' అని ఆయన స్పష్టం చేశారు. దీనితో మంగళవారం పేటీఎం షేర్లు 9 శాతానికి పైగా నష్టపోయాయి. ప్రస్తుతం పేటీఎం షేర్ విలువ రూ.385.75గా ఉంది. ఇది 52 వారాల కనిష్ఠం కావడం గమనార్హం.
ఖాతాదారుల పరిస్థితి ఏమిటి?
పేటీఎం యూజర్లు ఫిబ్రవరి 29 వరకు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆ తరువాత పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుపడదు. ఒకవేళ యూజర్ల యూపీఐ ఐడీ - ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ఇతర బ్యాంకులతో లింక్ అయ్యుంటే ఎలాంటి సమస్య ఉండదు.
పేటీఎం వాలెట్ సంగతేంటి?
పేటీఎం వాలెట్ అనేది పూర్తిగా పీపీబీఎల్‌పై ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు ఫిబ్రవరి 29 వరకు మాత్రమే పేటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయగలుగుతారు. ఆ తరువాత కుదరదు. ఒకవేళ ఖాతాదారులకు డబ్బులు అవసరమైతే ఇప్పటివరకు పేటీఎంలో ఉన్న డబ్బులు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. ఖాతాదారులు కోరుకుంటే వారి పేటీఎం వాలెట్లోని డబ్బును ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా ఇతర బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఫాస్టాగ్‌లు పనిచేయవు. అయితే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ సర్వీసులు సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఆర్బీఐ ఆర్డర్స్ వీటిపై ప్రభావం చూపవు. కనుక పేటీఎం అందిస్తున్న స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ సర్వీసులపై నేరుగా ప్రభావం పడకపోవచ్చు!
లోన్స్ పరిస్థితి ఏమిటి?
పేటీఎం అందించే లోన్స్‌పై ఆర్బీఐ ఆంక్షల ప్రభావం ఉండదు. ఎందుకంటే పేటీఎం మంజూరు చేసిన రుణాలను థర్డ్ పార్టీ లెండర్లు వసూలు చేస్తారు. కనుక పేటీఎం ద్వారా లోన్స్ తీసుకున్న రుణగ్రహీతలు వాటిని కచ్చితంగా తిరిగి కట్టాల్సిందే.
స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించాలా? వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 టిప్స్ పాటించండి!