Kalyan Jewellers MD Success Story : మన దేశంలో బంగారం వ్యాపారం అంతకంతకూ విస్తరిస్తుండగా, కొంతమంది వ్యాపారవేత్తలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. అలా భారత్‌లో అగ్రగామి బంగారు విక్రయ సంస్థల్లో కల్యాణ్ జ్యువెలర్స్ ఒకటి. వాస్తవానికి కల్యాణ్ జ్యువెలర్స్ పేరు వినని పసిడి ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఆ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయనే టీఎస్ కల్యాణ రామన్. మరి కల్యాణ్ రామన్ విజయ ప్రస్థానాన్ని ఓసారి తెలుసుకుందాం.
కేరళలోని త్రిసూర్‌కు చెందిన కల్యాణ్ రామన్- 12 ఏళ్ల వయసులోనే బంగారం వ్యాపారంలోకి ప్రవేశించారు. తన తండ్రి వ్యాపారంలో సహాయం చేసేవారు. ఆ తర్వాత శ్రీ కేరళ వర్మ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం బంగారం దుకాణాన్ని తెరవాలని నిర్ణయించుకున్నారు. తాను అప్పటికే పొదుపు చేసుకున్న రూ.25లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్నారు. అవి సరిపడక లోన్ రూపంలో రూ.50 లక్షల అప్పు తీసుకున్నారు.
మొత్తం రూ.75 లక్షలను వెచ్చించి త్రిసూర్‌లో 1993లో కల్యాణ్ జ్యువెలర్స్ తొలి షోరూమ్‌ను మొదలుపెట్టారు. అప్పటి నుంచి దశాబ్దాలపాటు కల్యాణ్ జువెలర్స్‌ను విజయపథంలో నడపిస్తున్న ఆయన, నేడు దానిని 1.35 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా 150 స్టోర్స్‌ను తెరిచారు. విదేశాల్లో 30 షోరూమ్స్‌ను ప్రారంభించారు. వార్బర్గ్ పింకాస్ లాంటి పెట్టుబడిదారులు కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రస్తుతం ఆ సంస్థ రెవెన్యూ 1.35 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ప్రఖ్యాత ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, కల్యాణ్ రామన్ సంపద విలువ అక్షరాలా 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన వద్ద ఎన్నో ఖరీదైన కార్లతో పాటు రూ.178 కోట్ల విలువ చేసే ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఓవైపు బంగారు వ్యాపారం చేస్తూనే మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. కల్యాణ్ డెవలపర్స్ పేరుతో దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్నారు. దానిని కూడా విజయపథంలో నడిపిస్తున్నారు.