Money Investment Tips In Telugu : సాధారణంగా డబ్బును సంపాదించగానే సరిపోదు. వచ్చిన డబ్బులను ఒక క్రమ పద్ధతిలో ఖర్చు చేయాలి. భవిష్యత్తు అవసరాలను ఊహిస్తూ పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే మనకు తగిన భరోసా లభిస్తుంది. దీని కోసం కొన్ని సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది. అవేమిటంటే.
30 శాతం: మీ క్రెడిట్ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదు.
ఉదాహరణకు మీ కార్డు పరిమితి రూ.1,00,000 ఉందనుకుందాం. నెలలో దీనిని రూ.30,000 మించి వాడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైనా కాస్త అధికంగా వాడినా, నెల మధ్యలోనే ఆ మేరకు చెల్లించే ప్రయత్నం చేయాలి.
70 శాతం: ఇప్పుడు వస్తున్న ఆదాయంలో కనీసం 70 శాతం పదవీ విరమణ తర్వాతా వచ్చేలా ప్రణాళిక ఉండాలి.
ఉదాహరణకు ఇప్పుడు మీ నెల జీతం రూ.1,00,000 అనుకుందాం. పదవీ విరమణ చేసిన తర్వాత రూ.70,000 ఆదాయం ఉంటేనే ప్రస్తుత జీవన శైలిలో జీవించగలరు.
10-15 శాతం: మీ ఆదాయంలో 10-15 శాతాన్ని భవిష్యత్ అవసరాల కోసం మదుపు చేయాలి.
ఉదాహరణకు మీ నెల ఆదాయం రూ.80,000 ఉంటే ఇందులో కనీసం రూ.12,000 పెట్టుబడికి మళ్లించాలి.
రూల్ 115: మీకు వచ్చిన రాబడి మూడు రెట్లు అయ్యేందుకు పట్టే సమయం ఎంతో ఎలా తెలుసుకోవాలి? దీనికి ఉపయోగపడేదే రూల్ 115. పెట్టుబడులపై వచ్చే రాబడితో 115ను భాగిస్తే ఎన్నాళ్లలో డబ్బు మూడింతలు అవుతుందో తెలుస్తుంది.
ఉదాహరణకు మీరు రూ.లక్షను 8 శాతం వడ్డీ వస్తున్న చోట మదుపు చేశారనుకోండి. ఈ డబ్బు రూ.3 లక్షలు అయ్యేందుకు 14 ఏళ్ల సమయం తీసుకుంటుంది.
10 శాతం మించకుండా: షేర్లలో మదుపు చేస్తున్నా, ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నా.. మీ మొత్తం పెట్టుబడిలో 10 శాతానికి మించి ఒకే షేరు, ఫండ్‌లో ఉండకుండా చూసుకోవాలి.
అంటే మీ పెట్టుబడి రూ.10 లక్షలు ఉందనుకుందాం. అప్పుడు ఒకే షేరులో లేదా ఫండ్‌లో రూ.లక్షకు మించి ఉండకుండా పోర్ట్‌ఫోలియోను నిర్వహించాలి.
24 గంటలు: ఒక వస్తువును కొనాలి అనుకున్నప్పుడు కనీసం వేచి చూడాల్సిన సమయం. అనుకున్న వెంటనే కొనడం మానేయాలి. కనీసం ఒక రోజు తర్వాతే ఆ వస్తువును కొనాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఖర్చులు నియంత్రణలో ఉంటాయి.