Import Duty Slash On Mobile Parts : కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే పలు విడిభాగాలపై దిగుమతి సంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.
'కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మొబైల్ ఫోన్ సెక్టార్‌కు ఎంతో మేలు జరగనుంది. ముఖ్యంగా ఇది మొబైల్ తయారీ రంగం వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి మన దేశీయ మొబైల్ తయారీ రంగం ఎదుగుతుంది' అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి.
వీటిపై ఇంపోర్ట్ టాక్స్ తగ్గింది
- కేంద్ర ప్రభుత్వం సెల్యులార్ మొబైల్ ఫోన్ తయారీకి ఉపయోగించే స్క్రూ, సిమ్ సాకెట్ సహా మెటల్‌తో తయారు చేసే అన్ని మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.
- బ్యాటరీ కవర్, ఫ్రంట్ కవర్, మిడిల్ కవర్, మెయిల్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్ఎం యాంటెన్నా/ ఇతర టెక్నాలజీలకు సంబంధించిన యాంటెన్నా, పీయూ కేస్/ సీలింగ్ గ్యాస్కెట్ (రబ్బరు పట్టీ);
- పాలియురేతేన్ ఫోమ్‌తో తయారు చేసిన సీలింగ్ గ్యాస్కెట్/ కేస్, పీఈ, పీపీ, ఈపీఎస్, పీసీ లాంటి వస్తువులు;
- పాలిమర్, పాలిమర్ కాంబినేషన్స్ సహా, ప్లాస్టిక్‌తో చేసిన మోకానికల్ ఐటెమ్స్‌పై కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది.
- కండక్టివ్ క్లాత్, ఎల్సీడీ కండక్టివ్ ఫోమ్, ఎల్సీడీ ఫోమ్, బీటీ ఫోమ్, హీట్ డిసిపేషన్ స్టిక్కర్ బ్యాటరీ కవర్, స్టిక్కర్-బ్యాటరీ స్లాట్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించింది.
- మెయిన్ లెన్స్ ప్రొటెక్టివ్ ఫిల్మ్, ఎల్సీడీ ఎఫ్పీసీ, ఫిల్మ్-ఫ్రంట్ ఫ్లాష్, సైడ్-కీ ఇంకా పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించింది.
మేకిన్ ఇన్ ఇండియా
కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను సాధించేందుకు భారతీయ తయారీదారులకు పలు ప్రోత్సాహాలు అందిస్తోంది. అందులో భాగంగా తాజాగా మొబైల్ తయారీకి కావాల్సిన విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రపంచ స్థాయిలో భారతీయ తయారీదారులు పోటీ పడడానికి వీలవుతుంది. అలాగే దేశంలోకి పెట్టుబడులు ఆకర్షించడానికి, ఎగుమతులను పెంచడానికి వీలవుతుంది. మరీ ముఖ్యంగా గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ చేరుతుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విషయంలో ఇతరులపై ఆధారపడడం తగ్గుతుంది. అందుకే భారత ప్రభుత్వం ఉత్పత్తి ప్రోత్సాహక (ప్రొడక్షన్ ఇన్సెన్టివ్ స్కీమ్) పథకాలను ప్రారంభించింది.
వృద్ధి పథంలో టెలికాం పరిశ్రమ
భారతదేశంలో టెలికాం పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోంది. అందుకే పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగంలో భారీ ఎత్తున ఉపాధి కల్పన జరిగింది. ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఒక అంచనా ప్రకారం 2022-23లో 10 బిలియన్ డాలర్ల మేర టెలికాం ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఎలక్ట్రానిక్స్ ఒకటి. డిజిటల్ ప్రపంచంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల జీవనశైలిని ఇవి గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్-19 సంక్షోభం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
మీ ఫాస్టాగ్ KYC పూర్తి చేశారా? లేదంటే ఖాతా బ్లాక్ - ఇవాళే లాస్ట్ డేట్!
బడ్జెట్ 2024లో వరాల జల్లు - పీఎం కిసాన్ డబ్బులు పెంపు; ఫ్రీగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్!