Health Benefits In Savings Account : దేశంలో నేడు బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. తమ ఖాతాదారులకు కేవలం సంప్రదాయ ఆర్థిక సేవలను అందించడం వాటికి మాత్రమే బ్యాంకులు పరిమితం కావటం లేదు. అంతకు మించి అనేక ప్రయోజనాలను కల్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వినియోగదారుల సంక్షేమం. అంటే తమ కస్టమర్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆరోగ్య బీమా ప్రయోజనాలు లాంటి సేవలను కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇందుకోసం ఆరోగ్య బీమా సంస్థలకు, వినియోగదారులకు మధ్య బీమా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాయి.
ఆరోగ్య బీమా
సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు జాయింట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రక్షణ కల్పించేందుకు ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. పలు బీమా సంస్థలతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొని, వీటిని తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు పొదుపు ఖాతా ప్రారంభించేటప్పుడు ఈ తరహా పాలసీలను ఆయా బ్యాంకులు అందిస్తున్నాయా లేవా అని చెక్ చేయండి.
రోజుకు రూ.500
కేవలం ఆరోగ్య బీమానే కాకుండా హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అనే ప్రత్యేక ప్రయోజనమూ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి లభిస్తుంది. ఈ ప్రయోజనం కింద రోజుకు రూ.500 వరకు బ్యాంకులు చెల్లిస్తాయి. ఇలా 10 రోజుల పాటు అందుకోవచ్చు. వైద్యానికి సంబంధించి చిన్నపాటి ఖర్చుల కోసం వీటిని వినియోగించుకోవచ్చు. ఖాతాదారుల సంక్షేమం కోసం కొన్ని బ్యాంకులు ఈ రకమైన వెసులుబాటును కల్పిస్తున్నాయి.
బ్యాంకుల ద్వారా వైద్య పరీక్షలు
తమ ఖాతాదారులకు ఏడాదికోసారి అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలను చేయించుకునేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి పరీక్షల ద్వారా భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యపరమైన ఇబ్బందులను ముందే గుర్తించవచ్చు. ఇందుకోసం సంవత్సరానికి నిర్ణీత మొత్తంలో కొంత నగదును తమ కస్టమర్లకు చెల్లిస్తున్నాయి.
ప్రయోజనాలు మారవచ్చు!
సేవింగ్స్ అకౌంట్‌ను తెరిచే సమయంలో పై అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించండి. అయితే పొదుపు ఖాతాలో చాలా రకాలు ఉంటాయి. మీరు ఎంచుకునే పొదుపు ఖాతా రకం అధారంగా ప్రయోజనాల్లో మార్పులు ఉండవచ్చు. అందుకని ముందుగానే ఏ ఖాతా అయితే మీకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుంటే మంచిది. ఆ తర్వాతే ఖాతాను ప్రారంభించండి.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టింగ్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయిందా? అసలు కారణాలు ఇవే!
మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ 8 లాభాలు గురించి తెలుసుకోండి!