Driving Licence New Rules Update : డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం కొత్త రూల్స్ అమలు చేస్తోందని.. ఇకపై లైసెన్స్(Driving Licence) కోసం రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. జూన్ 1 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడీ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆర్టీవో వద్దకు వెళ్లాల్సిన పనిలేదు!
జూన్ 1 నుంచి మారుతున్న నిబంధనల ప్రకారం.. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్‌టీఓ (RTO) ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఆర్‌టీఓ ఆఫీసుకు బదులుగా, ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్దనే డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చని కేంద్రం ప్రకటించింది. ఆ సెంటర్ నిర్వాహకులే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి.. అర్హులకు సర్టిఫికెట్ ఇస్తారని.. దాని ద్వారా ఆర్‌టీఓ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని తెలిపింది. లైసెన్స్ కోసం అప్లై చేసేవాళ్లు ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడం.. పూర్తిగా ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది.
యూ టర్న్!
జూన్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రాబోతున్నట్టు భావించినప్పటికీ.. అందుకు ఇక్కడి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని సమాచారం. అందుకే అనివార్యంగా యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. రవాణాశాఖ వర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. పాత పద్ధతిలోనే లైసెన్సుల జారీ కొనసాగనుంది.
డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్లైన్ & ఆఫ్‌లైన్ విధానాల్లో అప్లై చేసుకోండిలా!
దరఖాస్తు రాలేదు.. నోటిఫై చేయలేదు..
కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్సు కోసం అభ్యర్థులు ఆర్టీవో కార్యాలయానికి పోవాల్సిన అవసరం లేదు. ఈ బాధ్యతలు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లకు అప్పజెప్పుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం ఆసక్తి ఉన్న డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు RTAకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత RTA అధికారులు ఆయా డ్రైవింగ్ స్కూళ్లకు పర్మిషన్ ఇస్తారు. అయితే.. ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల కోసం ఇప్పటి వరకూ ఎవరూ దరఖాస్తు చేయలేదని ఆర్టీఏ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నోటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషనూ జారీ చేయలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో.. పాత పద్ధతిలోనే లైసెన్స్ జారీ కొనసాగుతుందని చెబుతున్నారు.
పాత విధానం ఇలా..
పాత పద్ధతిలో.. మొదట లెర్నర్ లైసెన్స్ కోసం అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రాత పరీక్ష కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాలి. ఆ తర్వాత నిర్ణయించిన గడువులో డ్రైవింగ్ టెస్టులో పాల్గొనాలి. వీటిల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతనే పూర్తి లైసెన్స్ అందిస్తారు.