Fixed Deposit Interest Rates 2024 : ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తమ డబ్బులకు రక్షణ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు సైతం అలాంటి వారిని ఆకర్షించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో డిపాజిటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎఫ్డీ చేయాలనుకునే వారికి ఆయా బ్యాంకులు అందించే ఆకర్షనీయమైన వడ్డీరేట్ల వివరాలు మీకోసం.
ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక్కటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడేళ్ల కాలవ్యవధితో ఫిక్సిడ్ డిపాజిట్లపై సంవత్సరానికి 7శాతం చొప్పున వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.5 శాతం చెల్లిస్తుంది. 4 సంవత్సరాల 7 నెలల కాలవ్యవధి గల డిపాజిట్లకు అత్యధికంగా 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు 2024 జూలై 24 నుంచి అమలులో ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ సైతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్‌తో మాదిరిగా, 3 సంవత్సరాల ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు సంవత్సరానికి 7 శాతం చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల వ్యవదిగల డిపాజిట్లపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు 2024 ఆగస్టు 10 నుంచి అమలులోకి వచ్చాయి.
ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు సంవత్సరాలకుగాను, డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 6.75 శాతం వడ్డీని చెల్లిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు మాత్రం 7.25 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 2 నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లకు, వడ్డీ రేటు సంవత్సరానికి 7 శాతం ఇవ్వనుంది. సవరించిన వడ్డీరేట్లు 2024 జూన్ 15 నుంచి అమలులోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ డిపాజిటర్లకు 7.15 శాతం వడ్డీ చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3 సంవత్సరాల ఎఫ్‌డీలపై 7.65 వడ్డీని చెల్లిస్తుది. సవరించిన ఈ వడ్డీ రేట్లు 2024 జూలై 15 నుంచి అమలు అవుతున్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ మూడు సంవత్సరాల కాల వ్యవధితో డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేట్లను అందజేస్తుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా కొంచెం ఎక్కువ రేట్లతో ముందు నిలుస్తుంది. ఎక్కువ వడ్డీ కోరుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆకర్షణీయమైన ఎంపికగా చెప్పవచ్చు. దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. కనుక డిపాజిటర్లు పూర్తి అవగానతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయా బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్ల వివరాలను తెలుసుకోవడం మంచిది.
SBIలో 1100 పోస్టులు - అప్లైకు మరో 4 రోజులే ఛాన్స్ - పూర్తి వివరాలివే! - SBI Recruitment 2024
ఆర్బీఐ నయా రూల్ - ఇకపై మరింత ఈజీగా బ్యాంక్ లోన్స్! - Credit Report Update Rule