Family Pension Full Details In Telugu : ఏ కుటుంబానికైనా ఆర్థిక స్థిరత్వం చాలా కీలకం. భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు చాలా మంది ఉద్యోగులు పెన్షన్‌ను ప్లాన్ చేసుకుంటారు. పెన్షన్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుందని భావిస్తుంటారు. అలాగే వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకూడదని అనుకుంటారు. అయితే ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం పలు పెన్షన్ స్కీమ్‌లను తీసుకొచ్చింది. అయితే ఉద్యోగి హఠాత్తుగా మరణిస్తే కుటుంబ పరిస్థితి ఏంటి? వారి ఆర్థిక భద్రతకు భరోసా ఏమిటి? అనే ప్రశ్నలు వస్తాయి. ఉద్యోగులు తమ కుటుంబం కోసం 'ఫ్యామిలీ పెన్షన్' కోసం ప్లాన్ చేయాలి. ఇంతకూ కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి? దానికి ఎవరు అర్హులు? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి?
కుటుంబ పింఛను అనేది వ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం తీసుకొచ్చింది. పదవీ విరమణకు ముందు ఉద్యోగులు దురదృష్టశాత్తు మరణిస్తే, వారి కుటుంబాలకు ఇది ఆర్థిక సాయం అందేలా చేస్తుంది. ఉద్యోగులు తమ జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ యజమాన్యం కూడా ప్రతి నెలా అంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగైన డబ్బును ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ రూపంలో అందిస్తారు. అయితే ఉద్యోగి పదవీ విరమణకు ముందు మరణిస్తే, అతడి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిబంధనల ప్రకారం, కనీసం పదేళ్లపాటు కంపెనీలో పనిచేసిన ఉద్యోగి పెన్షన్‌కు అర్హులు అవుతారు. ఆ తర్వాత ఉద్యోగి మరణిస్తే, అతని/ఆమె కుటుంబం ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హత పొందుతుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ అర్హత కోసం ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలు విధించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కుటుంబ పెన్షన్‌కు ఎవరు అర్హులు?
కుటుంబ పెన్షన్‌కు మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి ప్రధాన లబ్ధిదారు అవుతారు. ఉద్యోగి భార్యకు పెన్షన్‌లో 50 శాతం లభిస్తుంది. 25 ఏళ్లు కంటే తక్కువ వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉంటే వారికి చెరో 25 శాతం పెన్షన్ అందుతుంది. ఉద్యోగి మరణించిన తర్వాత అతడి జీవిత భాగస్వామి మళ్లీ పెళ్లి చేసుకుంది అనుకుందాం. అప్పుడు ఉద్యోగి పిల్లలు 25 ఏళ్లు వచ్చే వరకు 75 శాతం పెన్షన్‌ను పొందుతారు. శారీరక వైకల్యం ఉన్న ఉద్యోగి పిల్లలు జీవితాంతం 75 శాతం పెన్షన్‌ను పొందుతారు. అదే అవివాహిత ఉద్యోగి మరణించిన సందర్భంలో అతడి/ ఆమె తల్లిదండ్రులు జీవితాంతం పూర్తి పెన్షన్‌ను పొందుతారు.
రూ.9 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? ఈ టాప్-10 వెహికల్స్ ఇవే! - Best Car For Family
భారత్ మార్కెట్లో మరో బాంబు పేలనుందా? హిండెన్‌బర్గ్ తరువాతి టార్గెట్ ఎవరు? - Hindenburg India Tweet