How To Apply For Mudra Loan : మీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? కానీ అందుకు తగినంత డబ్బు మీ దగ్గర లేదా? డోంట్ వర్రీ. మీ లాంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ముద్రా యోజన' పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద ఎలాంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం అందిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.
సొంతంగా వ్యాపారం చేయాలంటే చాలా డబ్బులు అవసరం. కానీ చాలా మంది దగ్గర అంత డబ్బు ఉండదు. పోనీ బ్యాంక్ రుణం తీసుకుందామంటే, వాళ్లకు కచ్చితంగా హామీ చూపించాల్సి ఉంటుంది. దీనితో చాలా మంది తమ వ్యాపార ఆలోచనలే మానుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకువచ్చినదే ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ స్కీమ్ ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అవసరమైన రుణాన్ని ఎలాంటి హామీ లేకుండానే బ్యాంకులు అందించేలా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. 'ముద్రా' అంటే మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అని అర్థం. ఇది దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం స్థాపించిన సంస్థ. ఇది బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా ఔత్సాహిక వ్యాపారులకు నిధులు సమకూరుస్తుంది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు మాత్రమే రుణం ఇచ్చేవారు. అయితే 2024 కేంద్ర బడ్జెట్‌లో ఈ ముద్రా లోన్ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
హామీ లేకుండానే రుణం!
ముద్రా రుణాలు పొందేందుకు ఎలాంటి పూచీకత్తు చూపించాల్సిన అవసరం లేదు. పైగా వీటి వడ్డీ రేట్లు మిగతా వాటితో పోల్చితే చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు వ్యాపారం, పరిశ్రమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రుణాన్ని తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో వ్యాపారం చేసుకునేందుకు రుణాలు అందిస్తారు. వ్యక్తిగతంగా అయినా, వ్యాపార భాగస్వాములతో కలిసి అయినా ఈ లోన్స్ తీసుకోవచ్చు.
వీటికి కూడా!
వ్యవసాయ అనుబంధ రంగాలకు అంటే, కోళ్లు, చేపలు, తేనెటీగల పెంపకానికి రుణాలు మంజూరు చేస్తారు. అలాగే పళ్లు, కూరగాయల షాపులకు, టిఫిన్ సెంటర్లకు, హోటళ్లకు, చిన్న చిన్న దుకాణాలకు సైతం ఈ ముద్రా రుణాలు ఇస్తారు.
రుణార్హతలు
18 ఏళ్లు దాడిన భారతీయ పౌరులందరూ ఈ ముద్రా లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలు, ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, చిరునామా, మీ ఫొటో తదితర వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
ముద్రా రుణాలకు దరఖాస్తు చేయడం ఎలా?
- ముందుగా మీరు ఉద్యమమిత్ర వెబ్‌సైట్ https://www.udyamimitra.in/ ఓపెన్ చేయాలి.
- వెబ్‌సైట్‌లోకి వెళ్లి Mudra Loans Apply లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీరు పేరు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. తరువాత
- మీరు పెట్టదలుచుకున్న వ్యాపారం లేదా పరిశ్రమ వివరాలు నమోదు చేయాలి.
- లోన్ అప్లికేషన్ సెంటర్‌పై క్లిక్ చేసి మీ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను అప్లోడ్ చేయాలి. లేదా
- మీ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఒక 'హ్యాండ్ హోల్డింగ్ ఏజెన్సీ'ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత
- మీ అర్హతను బట్టి - ముద్రా శిశు, ముద్రా కిశోర్, ముద్రా తరుణ్ విభాగాల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి.
- మీ వ్యాపారం లేదా పరిశ్రమ పూర్తి వివరాలు, బ్యాంకింగ్, రుణ వివరాలు, ఇతర సమాచారం మొత్తాన్ని నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- వెంటనే మీకొక 'నంబర్' వస్తుంది. దానిని చాలా భద్రంగా నోట్ చేసుకోవాలి. అంతే సింపుల్!
గుడ్ న్యూస్ - ముద్ర లోన్ లిమిట్ రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు! - MUDRA Loan Scheme Doubled