Congress On Adani Bribery Case : మిలియన్ డాలర్ల కొద్దీ లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ స్పందించింది. అదానీ గ్రూపుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని(జేపీసీ) ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్ చేసింది.
'మోదానీ' స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటుచేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు. ప్రధాని మోదీకి, ఆయనకు ఎంతో ఇష్టమైన వ్యాపారవేత్తకు ఉన్న సంబంధాలపై "హమ్ అదానీ కే హైన్ కౌన్" సిరీస్‌లో భాగంగా ఎన్నో ప్రశ్నలు సంధించినట్లు జైరాం రమేష్ గుర్తుచేశారు. ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదని విమర్శించారు. మరోవైపు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024
"పార్లమెంటు సమావేశాల ముందు ఆరోపణలు- చాలా అనుమానాలున్నాయ్"
పార్లమెంటు సమావేశాల ముందు గౌతమ్ అదానీపై కేసు ప్రస్తావన రావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్య అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ అన్నారు. జైరాం రమేష్ పోస్ట్‌కు ఎక్స్‌లో మాలవీయ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
'జార్జ్ సోరోస్ పనే ఇదంతా!'
అదానీపై ఆరోపణలుచేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సొరోస్‌కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందని మాలవీయ అన్నారు. 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి వరకూ అదానీ గ్రూపు లంచం ఇచ్చినట్లు చెబుతున్న అధికారులు ఉన్న రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష పార్టీలు పాలించినవేనని పేర్కొన్నారు. వాటిలో ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారా అని జైరాం రమేష్‌ను మాలవీయ ప్రశ్నించారు. 2021-2022 కాలంలో ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఆరోపణలు చేసేముందు అమెరికా కేసు డాక్యుమెంట్‌ను ఒకసారి చదువుకోవాలని జైరాం రమేష్‌కు బీజేపీ నేత మాలవీయ సూచించారు.
It is always good to read before one reacts. The document you quote says, “The charges in the indictment are allegations and the defendants are presumed innocent unless and until proven guilty.”
— Amit Malviya (@amitmalviya) November 21, 2024
But be as it may, the essence of the charge is that US and Indian companies agreed… https://t.co/Y3UivigtTx pic.twitter.com/MkMri2fPQs
ఇదీ కేసు
సౌర విద్యుత్ ఒప్పందాల కోసం తమకు అనుకూలంగా నిబంధనలు చేర్చేలా భారత అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారనే ఆరోపణలపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. 2 బిలియన్ డాలర్లకుపైగా లాభాలను తెచ్చే అదానీ గ్రీన్ సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం 2020-24 మధ్య భారత ప్రభుత్వ అధికారులకు 250మిలియన్ డాలర్లకుపైగా లంచం ఇచ్చారని అదానీ, ఆయన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ఈ విషయాలను దాచిపెట్టి తప్పుడు సమాచారంతో సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌ల కోసం అదానీ సంస్థ అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి బిలియన్ డాలర్ల రుణాలు సేకరించిందని ఆరోపించారు.