AI Robot soldiers : యుద్ధభూమిలో శత్రువులను పసిగట్టి మట్టుబెట్టే ఏఐ రోబోను తయారుచేశారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు. ఈ రోబో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా ఏరిపారేయగలదని చెబుతున్నారు. యుద్ధం సమయంలో సైనికులకు ఎంతో సహాయకరంగా ఉండే ఈ ఏఐ రోబో సైనికుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యార్థులు తయారుచేసిన రోబో
గోరఖ్‌పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(గిడా) ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఈ రోబోను సృష్టించారు. బీసీఏ, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న 8మంది గిడా విద్యార్థులు, దేశ సైనికుల భద్రత కోసం ఏఐ ఆధారిత రోబోను సిద్ధం చేశారు. ఈ రోబో 55 కిలోలు బరువుతో 6.6 అంగుళాల పొడవు ఉంది. దీని దీని ఎడమ చేయిపై 18ఎంఎం ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ను అమర్చారు. ఆర్మీ సైనికులు ఈ రోబో ద్వారా 2 కిలో మీటర్ల దూరం నుంచి రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. దీన్ని మెటల్, స్టీల్, ఫైబర్‌తో తయారుచేశారు. అలాగే ఈ రోబోను ఆటో, మాన్యువల్ మోడ్‌లో సైతం ఆపరేట్ చేయవచ్చు.
శత్రువును చూసిన వెంటనే కాల్పులు
గిడా ఇన్నోవేషన్ సెల్ సహకారంతో 8మంది విద్యార్థులు కలిసి ఈ రోబోను తయారుచేశారు. ఆటో మోడ్‌లో ఈ రోబో ఎదురుగా ఉన్న శత్రువును చూసిన వెంటనే కాల్పులు జరుపుతుంది. ఏఐ రోబోలో మొత్తం 12 ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ బారెల్స్‌ను అమర్చారు. ఇది ఏకకాలంలో వేర్వేరు దిశల్లో శత్రువులపై కాల్పులు జరిపేలా డిజైన్ చేశారు. ఈ రోబో ఒకే చోట నిలబడి 360 డిగ్రీలను కవర్ చేయగలదు.
సరిహద్దుల్లో, ఉగ్రవాదులతో జరిగే పోరులో తరచూ సైనికులు వీరమరణం పొందుతున్నారు. అలాంటి సమయాల్లో సైనికుల ప్రాణాల కాపాడేందుకు ఈ రోబో ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనోళ్లు ఎవరో గుర్తిస్తుంది
ఈ రోబో స్వదేశి సైనికులపై కాల్పులు జరపదు. శత్రు దేశ సైనికులపై మాత్రం వదిలిపెట్టదు. ఈ ఏఐ హ్యుమన్ రోబో మోడల్‌ను రక్షణ మంత్రిత్వ శాఖకు పంపేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో నిర్మించిన బంకర్లలో ఈ రోబోను మోహరించవచ్చు. దీంతో సురక్షితమైన ప్రదేశం నుంచి ఏఐ రోబోట్ ద్వారా శత్రువులను లక్ష్యంగా చేసుకోవచ్చు. రోబోలో అమర్చిన సెన్సార్లు సరిహద్దులో శత్రువుల రాకకు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తాయి. దీంతో రోబో, ఆర్మీ అధికారులు అప్రమత్తం అవుతారు.
6 నెలల సమయం- రూ.1.80 లక్షల ఖర్చు
రోబో తయారీలో గేర్ మోటార్ ఆర్మ్స్, హై పవర్ గేర్ మోటార్, మెటల్ పైపు, కెమెరా, సర్వో మోటార్లు, ఆర్ ఎఫ్ రిమోట్ కంట్రోల్, 12 వోల్ట్ బ్యాటరీ, మోటార్ సైకిల్ విడిభాగాలు తదితర పరికరాలను ఉపయోగించారు. రోబో తయారీకి దాదాపు ఆరు నెలల సమయం, రూ.1.80లక్షలు ఖర్చయ్యింది.
మరోవైపు, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ విద్యార్థులు ఏఐ హ్యుమన్ రోబో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారని గిడా డైరెక్టర్ డాక్టర్ ఎన్కే సింగ్ తెలిపారు. ఈ రోబో భవిష్యత్తులో సరిహద్దులోని సైనికుల ప్రాణాలకు రక్షిస్తుందని వెల్లడించారు. దేశ సైనికులకు రక్షణ కల్పించేందుకు విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్స్టిట్యూట్ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.