- పాఠశాల ఆవరణలో స్విమ్మింగ్ పూల్
- హైటెక్నాలజీతో 22 తరగతి గదులు
- ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్ట్స్
- విద్యార్థులకు స్పెషల్ ప్లే గ్రౌండ్
ఈ సదుపాయాలన్నీ చూస్తే అవన్నీ ఓ ఫేమస్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయనుకుంటున్నారా? కానే కాదు. ఈ అత్యాధునిక సౌకర్యాలన్నీ ఓ గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్నాయి. మూడు ఎకరాల్లో నిర్మించిన ఈ పాఠశాల త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే అడ్మిషన్లను స్వీకరిస్తుండగా, అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లను సైతం తలదన్నేలా ఉన్న ఈ పాఠశాల పంజాబ్‌లోని లుధియానాలో ఉంది.
స్విమ్మింగ్ పూల్‌తోపాటు అత్యాధునిక సౌకర్యాలతో పంజాబ్ ప్రభుత్వం ఈ పాఠశాలను లుధియానాలోని ఇంద్రపురిలో నిర్మించింది. 22 స్మార్ట్ తరగతి గదులతోపాటు విద్యార్థులకు సరిపడా టాయిలెట్ల నిర్మాణం కూడా చేపట్టింది. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్తోపాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. గతంలో ఇలాంటి స్కూల్‌ను అమృత్‌సర్‌లో ప్రారంభించింది మాన్ సర్కార్.
స్కూల్ అంతా సీసీటీవీ కెమెరాలు!
Swimming Pool In Government School : విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ పేరిట ఈ పాఠశాలను మూడు ఎకరాల్లో నిర్మించారు. విద్యార్థుల భద్రత కోసం స్కూల్ అంతా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. నాలుగు సైన్స్ ల్యాబ్‌లతోపాటు ప్రత్యేకమైన కంప్యూటర్ ల్యాబ్‌ను నిర్మించారు. 2024-25 విద్యా సంవతర్సానికి గాను అడ్మిషన్లను ప్రస్తుతం స్వీకరిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంద్రపురిలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1341 మంది విద్యార్థులను ఇక్కడికి తరలించనున్నారు.
అడ్మిషన్లకు గట్టిపోటీ
ఇక ఈ పాఠశాలలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రభుత్వ పాఠశాల ఎక్కడా చూడలేదని చెబుతున్నారు. ఇలాంటి సౌకర్యాలను కేవలం ప్రైవేట్ పాఠశాల్లో చూశామని, కానీ ప్రభుత్వ పాఠశాల్లో చూడలేదని అంటున్నారు. మరోవైపు, విద్యార్థులు కూడా తమ ప్రాంతంలో ఇలాంటి స్కూల్‌ను ప్రభుత్వం నిర్మించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
ప్రభుత్వం నిరంతర కృషి
లూధియానాలోని ఇంద్రపురిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారి జస్వీందర్ సింగ్ తెలిపారు. పాఠశాలలో ప్లేగ్రౌండ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్ సౌకర్యం కూడా ఉందని, పంజాబ్‌లోనే ఇలాంటి తొలి ప్రభుత్వ పాఠశాల ఇదేనని చెప్పారు. రాష్ట్రమంతా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
సెలవులే లేని బడి- 365 రోజులు, నిత్యం 14 గంటలు క్లాసులు- పిల్లలకు సూపర్ ఫన్, ఇన్కమ్!