Supreme Court On EC Appointment : కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్తగా చేరిన ఇద్దరు ఈసీల నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఇటీవలే కొత్తగా ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ నియామకాలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. 'ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పకూడదు. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేం. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యం. అలాగే 2023లో రాజ్యాంగ ధర్మాసం ఇచ్చిన తీర్పులో ఈసీ నియామకం కోసం సెలక్షన్ కమిటీలో న్యాయవ్యవస్థ సభ్యుడు ఉండాలని ఎక్కడా చెప్పలేదు'అని ధర్మాసనం పేర్కొంది.
2023 చట్టం రూపొందించక ముందు ఎన్నికల కమిషనర్ల నియామక తాత్కాలిక కమిటీలో ప్రధాని, సీజేఐ, లోక్‌సభలో విపక్షనేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రికి చోటు కల్పించారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కేంద్రం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్త చట్టంలో సీజేఐకు చోటు కల్పించకపోవడాన్ని సమర్థించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని తెలిపింది.
కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం
నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరితో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌ను కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది. ఆ పేర్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం వారిద్దరిని ద్రౌపదీ ముర్ము కొత్త ఈసీలుగా నియమిస్తున్నట్లు న్యాయమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వామపక్షాలకు 'డూ ఆర్ డై'- లోక్‌సభ ఎన్నికల్లో మనుగడ కోసం పోరాటం!
కాంగ్రెస్ కంచుకోటలకు బీటలు! అమేఠీ, రాయ్‌బరేలీలో పోటీకి గాంధీల వెనకడుగు?