Sri Krishna Janmabhoomi Case Update : శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ పత్రాలను తారుమారు చేసి షాహీ-ఈద్గా మసీదు కమిటీ కార్యదర్శి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై మథుర జిల్లా కోర్టు విచారణ జరిపింది. అయితే మున్సిపాలిటీ రికార్డుల్లో షాహీ-ఈద్గా మసీదు కమిటీ పేరు మీద పత్రాలు లేవని శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ కోర్టుకు తెలిపింది. మసీదు కమిటీ కార్యదర్శిపై కేసు నమోదు చేయాలని కోరింది.
'మసీదు కమిటీ పేరుతో ఎలాంటి పత్రాలు లేవు'
శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ అధ్యక్షుడు అశుతోష్ పాండే పిటిషన్‌పై శుక్రవారం సీజేఎం కోర్టులో విచారణ జరిగింది. షాహీ-ఈద్గా మసీదు కార్యదర్శి 49 ఏళ్ల క్రితం నకిలీ పత్రాలు తయారు చేసి తమ కమిటీ పేరు మీద నమోదు చేశారని ఆరోపించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ రికార్డుల్లో కమిటీ పేరుతో ఎలాంటి పత్రాలు అందుబాటులో లేవని చెప్పారు. కమిటీ కార్యదర్శిపై సంబంధింత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని మసీదు కమిటీ సెక్రటరీని కోర్టు ఆదేశించింది.
అసలు కేసు ఏంటంటే?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో మొఘల్ చక్రవర్తి కాలం నాటి షాహీ-ఈద్గా మసీదు ఉంది. అయితే శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ మథుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వాటిని మథుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు, దాని పర్యవేక్షణకు గాను అడ్వకేట్ కమిషనర్‌ను నియమించేందుకు అనుమతిస్తూ గతేడాది డిసెంబరు 14 ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఆదేశాల అమలుపై ఇటీవలే స్టే ఇచ్చింది.