SC on NEET UG Paper Leak : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. పేపర్ లీక్ కేవలం హజారీబాగ్, పట్నాకే పరిమితం అయ్యిందా? లేదా దేశవ్యాప్తంగా విస్తరించిందా అన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉందని సుప్రీం అభిప్రాయపడింది. ఇదే అంశంపై మాట్లాడిన పిటిషినర్ తరఫు న్యాయవాది, పలు అనుమానాలు లేవనెత్తారు. "ఎన్టీఏ ప్రకారం ఏప్రిల్ 24న పేపర్లు బయటకు పంపితే, మే3న బ్యాంక్‌లకు చేరాయి. దీనిని పరిశీలిస్తే ఏప్రిల్ 24 నుంచి మే3 వరకు ప్రశ్నాపత్రాలు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే ఉన్నాయి." అని కోర్టుకు చెప్పారు.
దీంతో పాటు ఓ ప్రశ్నకు రెండు ఆప్షన్లకు మార్కులు కేటాయించారంటూ కొందరు విద్యార్థులు ఎన్టీఏకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దానికి మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం, ముగ్గురు నిపుణులతో కూడిన ఒపీనియన్ కమిటీని నియమించాలని ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. సరైన సమాధానాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా తెలపాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
అంతకుముందు ఇదే అంశంపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం, మే 4కు ముందే పేపర్ లీక్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసుల దర్యాప్తు నివేదికను ప్రస్తావిస్తూ, స్ట్రాంగ్ రూమ్ నుంచే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా? అని ప్రశ్నించింది. పిటిషనర్ల పక్షాన వాదిస్తున్న న్యాయవాది నరేందర్ హుడా తన వాదనలు వినిపిస్తూ 161 వాంగ్మూలాలు పేపర్ లీక్ మే 4వ తేదీ కంటే ముందే జరిగిందని బలంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు.
బిహార్ పోలీసుల రిపోర్టు ప్రకారం సంబంధిత బ్యాంకుల్లో ప్రశ్నపత్రాలను డిపాజిట్ చేయటానికి ముందే లీకైందని పేర్కొన్నారు. మే 3వ తేదీ లేదా అంతకంటే ముందే పేపర్ బయటకు వెళ్లిండొచ్చని పేర్కొన్నారు. ఇదేదో 5-10 మంది విద్యార్థుల కోసం చేసిన లీకేజీ కాదని హుడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కచ్చితంగా ఓ గ్యాంగ్ ఎప్పటినుంచో ఈ పని చేస్తోందని పేర్కొన్నారు. సంజీవ్ ముఖియా, ఇతర కీలక నిందితులు అరెస్టు కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకచోట ప్రశ్నపత్రాన్ని రిక్షాలో కూడా తరలించారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.