SC On NEET UG 2024 : యూజీసీ- నీట్, 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేది లేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు అన్ని పిటీషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం గురువారం విచారించింది.
కేంద్రం, ఎన్టీఏ సమాధానం కోరిన సుప్రీం కోర్టు
నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. దేశంలోని పలు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్ టీఏ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లను విచారణను జులై 8కి వాయిదా వేసింది.
ప్రధాని 'నీట్ పరీక్షా పే చర్చ' ఎప్పుడు నిర్వహిస్తారు : ఖర్గే
లీకులు, మోసాలు లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై హస్తం పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రతి ఏడాది ప్రధాని విద్యార్థుల కోసం 'పరీక్షా పే చర్చ' అంటూ ఓ తమాషా నిర్వహిస్తున్నారని మండిపడింది. మోదీ ప్రభుత్వాన్ని పేపర్ లీక్ ప్రభుత్వంగా అభివర్ణించింది. ఈ పేపర్ లీకులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించింది. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లో జరిగిన అవకతవకలపై ప్రధానమంత్రి 'నీట్ పరీక్షా పే చర్చ' ఎప్పుడు నిర్వహిస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
'నాగ్‌పుర్ విద్యా విధానం అమలవుతోంది!'
'నీట్ యూజీ 2024 పరీక్షలో చాలా అవకతవకలు జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చిత్తశుద్ధిపై తీవ్ర అనుమానాలు ఉన్నాయి. కొత్త విద్యా విధానం 2020 భారతదేశ విద్యా వ్యవస్థను బాగుచేయడానికి పనిచేయట్లేదు. నాగ్‌పుర్ విద్యా విధానం(ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి) 2020గా మాత్రమే పనిచేస్తుంది.' అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.