SC On NEET Counselling : నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1,563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని జూన్ 23న తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు నీట్ కౌన్సెలింగ్‌ను ఆపేది లేదని కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఇదీ జరిగింది
ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల వీటిని కలిపారు. ఇలా మార్పులు కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, నీట్ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడం వల్ల కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1563 విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టు సమర్పించింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని కేంద్రం సుప్రీంకు తెలిపింది. గ్రేస్ మార్పులు రద్దు చేసిన వారికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చని తెలిపింది.
కౌన్సెలింగ్‌పై స్టే నిరాకరణ
1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులను ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఎడ్‌టెక్ సంస్థ 'ఫిజిక్స్ వాలా' చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెబ్ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం, ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, దానికి ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. నీట్-యూజీ 2024ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్‌లను జూలై 8న విచారణ జరుపుతామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తెలిపింది. జులై 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ముందు దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపట్టనున్నారు.
ఆధారాలు లేవు!
నీట్ యూజీసీ పేపర్ లీక్‌కు ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 1563 మంది విద్యార్థులకు జూన్ 23న పునఃపరీక్ష నిర్వహిస్తామని, ఫలితాలు జూన్ 30న ప్రకటిస్తామని, జూలై 6న కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని ప్రధాన్ వెల్లడించారు. నీట్ పరీక్షలో ఎక్కడా అవినీతి జరగలేదన్న ప్రధాన్, 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో ఏదైనా అవినీతి జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన్ తెలిపారు.
బీజేపీ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్
నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వ వైఖరి బాధ్యతారాహిత్యంగా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 24 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసే ఈ పరీక్షపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నీట్ పరీక్షకోసం ఒక్కో విద్యార్ధి నుంచి వివిధ కోచింగ్ సెంటర్‌లు దాదాపు రూ. 30 లక్షల వరకు వసూలు చేశాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4 వ తేదీనే నీట్ పరీక్షా ఫలితాలు విడుదల చేయటంపై గొగోయ్ అనుమానం వ్యక్తం చేశారు. 1569 మంది విద్యార్ధుల గ్రేస్ మార్కులు మాత్రమే తొలగిస్తామని కేంద్రం చెప్పటాన్ని ఆయన ఖండించారు. ఈ భారీ కుంభకోణంపై కేంద్రం ఎందుకు విచారణకు ఆదేశించటం లేదని గొగోయ్ ప్రశ్నించారు.
అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం- వరుసగా మూడోసారి బాధ్యతలు - Arunachal Pradesh CM Oath Ceremony