SC On Delhi Coaching Centre Tragedy : దిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆ ఘటనపై ప్రతి స్పందన కోరుతూ కేంద్రంతో పాటు దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి వస్తున్న ఔత్సాహికుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆడుకుంటున్నాయని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం మండిపడింది. కోచింగ్ సెంటర్లు మృత్యు గదులుగా మారాయని వ్యాఖ్యానించింది. కోచింగ్ సెంటర్ ఘటన కళ్లు తెరిపించిదన్న సుప్రీం కోర్టు భద్రతా నిబంధనలను పాటించకపోతే ఏ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా నిర్వహించడానికి అనుమతించకూడదని ఆదేశించింది.
సీబీఐ చేతికి కేసు
ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి ఘటన దర్యాప్తును శుక్రవారమే సీబీఐకు బదిలీ చేసింది దిల్లీ హైకోర్టు. ఘటన తీవ్రత, అవినీతి అధికారుల పాత్ర ఉండే అవకాశం ఉన్న కారణంగా, దర్యాప్తులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దర్యాప్తు పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ, ప్రమాదానికి దారితీసిన కారణాలు, నివారణ చర్యలతోపాటు విధానపరమైన మార్పులను సిఫారసు చేస్తుందని హోంశాఖ ఉన్నతాధికారి తెలిపారు. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి, దిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, దిల్లీ పోలీస్ స్పెషల్ సీపీ, ఫైర్ అడ్వైజర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు.
గత నెల 27న రావూస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు చేరడం వల్ల సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న శ్రేయా యాదవ్, తాన్యా సోని, నెవిన్ డాల్విన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దిల్లీ సహా పలు చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు దిల్లీ మున్సిపాలిటీ అధికారులు సీల్ వేశారు.