Reasons Of Rahul Gandhi Kept Raebareli Seat : అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్(కేరళ) లోక్‌సభ స్థానాన్ని వదులుకున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉప ఎన్నిక బరిలో దిగనున్నారు. దీంతో దక్షిణాదిలో పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగించినట్లు భావిస్తున్నారు. అలాగే రాహుల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగనున్నారు. అయితే రాహుల్ రాయ్‌బరేలీ స్థానాన్ని నిలబెట్టుకోవడం వెనుక అనేక రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. దీని వెనుక ఉన్న హస్తం పార్టీ 10 వ్యూహాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యూపీ కీలకం
కేంద్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా ఉత్తర్‌ప్రదేశ్ చాలా కీలకం. ఎందుకంటే యూపీలో 80 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ సులువుగా కేంద్రంలో అధికారం చేపడుతుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈసారి యూపీలో భారీగా పుంజుకుంది. సమాజ్ వాదీ పార్టీతో కలిసి పోటీ చేసి మెరుగైన పనితీరును కనబరిచింది. అందుకే యూపీలోని రాయ్‌బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఆ సీటును వదులకోలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకల్లా పుంజుకోవాలనే వ్యూహంతో హస్తం పార్టీ ప్రణాళిక రచిస్తోంది.
ఈ రెండు స్థానాల్లో అభివృద్ధిని చూపిస్తూ
ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేఠీ, రాయ్‌బరేలీలో హస్తం పార్టీ గెలిచింది. అందుకే ఈసారి ఈ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను చూపిస్తూ వచ్చే ఎన్నికలనాటికి ప్రజలను మరింత ఆకర్షించవచ్చని భావిస్తోంది. అందుకే రాహుల్ రాయ్‌బరేలీ సీటును నిలబెట్టుకున్నారు.
ఆ తప్పు మళ్లీ చేయదు
యూపీలోని అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. మళ్లీ అటువంటి తప్పును కాంగ్రెస్ పార్టీ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే గాంధీ కుటుంబ కంచుకోటల్లో మరోసారి పార్టీ ఓటమిని చవిచూడకూడదని భావిస్తోంది.
భావోద్వేగ పరిచయం
2024 లోక్ సభ ఎన్నికల్లో భారీగా పుంజుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరు సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో అమేఠీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ చేసిన ప్రచారం యూపీలో చర్చనీయాంశమైంది. ప్రియాంక గాంధీ తన కుటుంబానికి సంబంధించి చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ప్రజలను ఆకట్టుకుంది. అందుకే రాయ్‌బరేలీ సీటుకు రాహుల్‌ను ఇంఛార్జ్‌గా నియమించింది అధిష్ఠానం.
అయోధ్యలో బీజేపీ ఓటమి- కాంగ్రెస్ ఆశలు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఓటమితో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీన్ని కాంగ్రెస్ పెద్ద అవకాశంగా భావిస్తోంది. ఈ అధికార వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తోంది. అందుకే రాహుల్ యూపీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉండడమే మేలని భావిస్తోంది.
రాహుల్- అఖిలేశ్ జోడీ సూపర్ హిట్
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడీ సూపర్ హిట్ అయ్యింది. ఇరుపార్టీల యువనాయకులు యూపీలో ప్రచారాన్ని అదరగొట్టారు. బీజేపీని తక్కువ సీట్లకే నిలువరించారు. బీజేపీని నిలువరించాలంటే ఈ జోడీ ఇలానే కొనసాగాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే రాహుల్ యూపీ నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉంచాలనుకుంటోంది.
పార్టీ వీడిన సీనియర్లు- డీలా పడ్డ కాంగ్రెస్
యూపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలా మంది కాంగ్రెస్ నేతలు హస్తం పార్టీని వీడారు. దీంతో పార్టీ కాస్త బలహీనంగా మారింది. అయినా లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో హస్తం పార్టీ రాణించింది. ఈ విజయం కాంగ్రెస్ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. యూపీలో కాంగ్రెస్ బలంగా మారుతుందని, రాహుల్ గాంధీ దానిని సమర్థంగా ముందుకు తీసుకెళ్లగలరని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన రాయ్‌బరేలీ సీటును నిలబెట్టుకున్నారు.
ఓటు బ్యాంకు కోసం
ఈ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ముస్లిం, యాదవ, దళిత ఓటర్లతో పాటు సంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రానున్న కాలంలో ఈ ఓటింగ్ శాతం మరింత పెరగొచ్చని హస్తం పార్టీ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత బలపడేందుకు కాంగ్రెస్ రాయ్‌బరేలీ సీటును వదులుకోలేదు.
బలమైన నేతలుగా రాహుల్, ప్రియాంక
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు ప్రజాదరణ పొందిన నాయకులు ఉన్నారు. కాంగ్రెస్‌కు మాత్రం రాహుల్, ప్రియాంక గాంధీనే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ రాయ్‌బరేలీ సీటును నిలబెట్టుకున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఈ సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ మెరుగైన ప్రదర్శన చేసింది. వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలుచుకోవచ్చని భావిస్తోంది. ఈ కారణంగానే రాహుల్ రాయ్‌బరేలీ సీటును నిలబెట్టుకున్నారు. వయనాడ్(కేరళ) సీటును రాహుల్ వదిలిపెట్టడం వల్ల ఆ పార్టీకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ సీటు కాంగ్రెస్‌కు కంచుకోట. ఉపఎన్నికల్లో హస్తం పార్టీ అధిష్ఠానం బలమైన అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రాను బరిలోకి దింపింది.