Pak Terror Attacks On Trains Across India : భారతదేశమంతటా రైళ్లపై దాడులకు పాల్పడాలంటూ స్లీపర్ సెల్స్‌కు ఒక ఉగ్రవాది ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో కలకలం సృష్టిస్తోంది. రామేశ్వరం కేఫ్ తరహాలోనే, దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు అతను ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయి. ఆ ఉగ్రవాది పేరు ఫర్హతుల్లా ఘోరి అని తెలుస్తోంది. ఈ ఉగ్రవాది పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ సహకారంతో స్లీపర్ సెల్ ద్వారా రామేశ్వరం కేఫ్‌లో బ్లాస్ట్‌కు పాల్పడ్డాడని నిఘావర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరిపై కొన్నేళ్లుగా భారత్ నిఘా వేస్తోంది. అతడు ఆదేశాలు ఇస్తోన్న మూడు నిమిషాల వీడియో కొద్ది రోజుల క్రితమే సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. అందులో రైళ్లు, పెట్రోలియం పైప్‌లైన్‌లపై దాడులు, ప్రెజర్ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు జరపాలంటూ విపరీత వ్యాఖ్యలు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ ఆస్తులపై దాడులు చేస్తూ, వారిని బలహీనపరుస్తోందని ఘోరి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని షేక్ చేయాలంటూ ప్రగల్భాలు పలికాడు. దీనితో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యయి.
చాలా దాడులకు పాల్పడ్డాడు!
ఇదిలా ఉంటే, దేశంలో చోటుచేసుకున్న పలు పేలుళ్ల వెనక ఘోరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 2002లో గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయం దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మంది గాయపడ్డారు. అలాగే 2005లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో అతడి ప్రమేయం ఉంది. ఘోరితో పాటు అతడి అల్లుడు షాహిద్ ఫైజల్ దక్షిణ భారతదేశంలో స్లీపర్‌సెల్స్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు. కేఫ్ బ్లాస్ట్ నిందితులతో ఫైజల్ సంప్రదింపులు జరిపడాన్ని అధికారులు గుర్తించారు.
ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఉగ్రవాది ప్రెజర్ కుక్కర్ బాంబు వాడినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఇదే తరహా దాడులు మరిన్ని చేయడానికి కుట్ర ఉగ్రవాదులు పన్నుతున్నారు.