Pocket Constitution Of India Rahul Gandhi : దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల పొడవు, తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్ బైండింగు చేసిన పాకెట్ రాజ్యాంగ ప్రతులకు ప్రస్తుతం డిమాండు పెరిగింది. ఒక మోస్తరుగా జేబులో పట్టేటంత సైజులో ఉండే ఈ పుస్తకాన్ని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పలుచోట్ల పదే పదే ప్రదర్శించడం వల్ల ప్రజల్లో ఈ ఎడిషన్‌పై ఆసక్తి పెరిగింది.
ఈ పాకెట్ రాజ్యాంగ పుస్తకాలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ప్రచురిస్తారు. నగరంలో సుమారు 80 ఏళ్ల చరిత్ర గల 'ఈస్టర్న్ బుక్ కంపెనీ' (ఈబీసీ) ప్రచురణకర్తలు గత పదిహేనేళ్లుగా ఈ పాకెట్ సైజు రాజ్యాంగ ప్రతులను ప్రచురిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా తీసుకెళ్లడం వల్లే ప్రజల్లో ఆసక్తి పెరిగిందని ఈబీసీ ప్రచురణ సంస్థ డైరెక్టరు సుమీత్ మాలిక్ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఈ పాకెట్ ఎడిషన్ కోసం ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. ఈ సైజు రాజ్యాంగ ప్రతుల ప్రచురణకు మొదట సుప్రీంకోర్టు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ తమను ప్రోత్సహించినట్లు తెలిపారు. ఆయన సూచనతోనే ఈ సైజు రాజ్యాంగ పుస్తకాల ప్రచురణ మొదటలు పెట్టినట్లు సుమీత్ మాలిక్ వెల్లడించారు.
70 ఏళ్ల కిందట రాసిన రాజ్యాంగం మీ చేతుల్లో
ఈ ప్రచురణను 2009లో ప్రారంభించి, ఇప్పటి వరకు 16 ఎడిషన్లు ప్రచురించినట్లు సుమీత్ తెలిపారు. 'ఈ సైజు రాజ్యాంగ ప్రతులను ఇప్పటి వరకు ఎక్కువగా న్యాయవాదులు, న్యాయమూర్తులు కొంటూ వచ్చారు. ఇతరులకు కానుకగా ఇచ్చేందుకు కూడా కొనేవారు. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇదే పుస్తకాన్ని బహూకరించారు. ఈ సైజు పుస్తకంలో ఫాంట్ సైజు విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నాం. రాజ్యాంగ అధికరణాల సంఖ్యలన్నీ ఎరుపు రంగులో, సమాచారం నల్లరంగులో ఉండేలా పలుచనైన బైబిలు పేపరుపై దీన్ని ప్రచురించాం' అని సుమీత్ పేర్కొన్నారు. అయితే ఈ పాకెట్ ఎడిషన్‌ను తీసుకుంటే 70 ఏళ్ల కిందట రాసిన మన దేశ విధిరాత మీ చేతుల్లో ఉన్నట్లేని ఈ రాజ్యాంగంలో రాసిన ముందుమాటలో భారత మాజీ అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ పేర్కొన్నారు.