PM Surya Ghar Yojana : సౌర విద్యుత్‌ను అందరికీ చేరువ చేసి, సుస్థిర ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజలీ యోజన'ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి గృహాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందగలుగుతారని తెలిపారు.
అంతేకాకుండా మరింత ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు, ఉపాధి కల్పనకు ఈ పథకం దారితీస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకుని వినియోగదారులు, ముఖ్యంగా యువకులు 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజలీ యోజన'ను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే తదితర ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు
ఈ పథకాన్ని ప్రధాని మోదీ అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో తొలిసారి ప్రకటించారు. అనంతరం కేంద్ర బడ్జెట్లోనూ దీని గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. తాజాగా దీన్ని పీఎం 'సూర్య ఘర్'గా పిలవనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ పథకానికి క్షేత్ర స్థాయిలో ప్రాచుర్యం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తమ పరిధిలోని వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు కేంద్రం ప్రోత్సాహకాలు అందించనుంది.
'పీఎమ్ సూర్యఘర్' పథకం ప్రయోజనాలివే
- సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకున్న వారికి ఏటా రూ.15-18 వేలు ఆదా అవుతాయి.
- ఈ సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో ఇంటి అవసరాలకు పోనూ, మిగతా కరెంట్‌ను డిస్కంలకు అమ్ముకోవచ్చు.
- ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
- ఈ పథకం ద్వారా సౌర ఫలకాలు సరఫరా చేసే చాలా పరిశ్రమలకు సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసే అవకాశాలు లభిస్తాయి.
- సోలార్ పరికరాల తయారీ, నిర్వహణ, సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఎవరు అర్హులు?
ఈ పథకం పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుతు ఉద్దేశించినది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తక్కువ ఆదాయం కలిగినవారు ఈ పథకానికి అర్హులు. రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌసింగ్ సొసైటీ సభ్యులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు https://pmsuryaghar.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ Apply For Rooftop Solar అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్టర్ కావాలి. అనంతరం మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి సోలార్ రూఫ్‌టాప్ కోసం ఫామ్‌ను నింపాలి. ఆ తర్వాత మీకు డిస్కంల నుంచి 'ఫీజిబిలిటీ అప్రూవల్' వస్తుంది. ఆ తర్వాత డిస్కంలలో రిజిస్టరైన సరఫరా దారుల ద్వారా మీరు సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్స్స్టలేషన్ అయిపోయిన తర్వాత ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ వచ్చాక మీ రూఫ్‌టాప్‌ను డిస్కం అధికారులు తనిఖీ చేసి 'కమిషనింగ్ సర్టిఫికెట్' ఇస్తారు. అనంతరం ఆ సర్టిఫికెట్తో పాటు క్యాన్సిల్ చేసిన బ్యాంక్ చెక్‌బుక్‌ను 'పీఎమ్ సూర్యఘర్' పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత 30 రోజుల్లో మీ అకౌంట్లలో సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి.
ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్- పక్కా ప్లాన్‌తో రైతుల ఆందోళనలు