Parliament Session Schedule 2024 : జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 18వ లోక్‌సభ తొలిసెషన్ జూన్ 24న ప్రారంభమవుతుందని రిజిజు ఎక్స్(అప్పటి ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. కాగా, ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికల ఎంపీలు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ను కూడా ఎన్నుకోనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 27న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో రాబోయే ఐదేళ్లలో కొత్త ప్రభుత్వం చేపట్టబోయే రోడ్ మ్యాప్‌ను వివరించే అవకాశం ఉంది. జూన్ 27న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను పార్లమెంట్‌కు పరిచయం చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పార్లమెంట్లో చర్చ జరగనుంది. అనంతరం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని విపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బాధ్యతలు స్వీకరించిన నిర్మల, గడ్కరీ, సింధియా
మరోవైపు, కేంద్రమంత్రులుగా నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా తమ బాధ్యతలను స్వీకరించారు. దిల్లీలోని నార్త్ బ్లాక్‌లో కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమెకు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. కాగా, మరికొద్ది రోజుల్లో నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాదికిగాను బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
బాధ్యతలు చేపట్టిన గడ్కరీ
రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ కూడా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు కార్యాలయంలోని అధికారులు అభినందనలు తెలియజేశారు. 'ఎన్డీఏ 3.Oలో నాకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆధునిక మౌలిక సదుపాయాలతో దూసుకెళ్తుంది' అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి చెందిన నితిన్ గడ్కరీ గత 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో 54,858 కి.మీ జాతీయ రహదారులను నిర్మించారు.
కేంద్ర మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా
కమ్యూనికేషన్లు, టెలికాం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా దిల్లీలో బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో బీజేపీ తరఫున గెలుపొందారు. ప్రధాని మోదీ 2.Oలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు.
అతివిశ్వాసం వల్లే బీజేపీ ఇలా- 'గాలిబుడగ'ను నమ్ముకుని ప్రచారం చేసి!: RSS - Lok Sabha Results 2024