Odisha Next CM : ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 78 స్థానాల్లో విజయం సాధించింది. బిజు జనతా దళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. లోక్‌సభ స్థానాల్లో కూడా బీజేపీ అదరగొట్టింది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకుగాను 20చోట్ల కమలం పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్ ఓ స్థానంలో గెలుపొందింది. బిజూ జనతాదళ్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలదళం సిద్ధమైంది. అయితే 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా రానుండడంపై ఆయన ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
సీఎం రేసులో ప్రముఖులు
బీజేపీ తరఫున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీమంత్రి జోయల్ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్ పండా, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, బాలాసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి, కాగ్ గిరీశ్ చంద్ర ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్
సంబల్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. సంబల్‌పుర్‌లో బిజు జనతా దళ్ అగ్రనేత ప్రణబ్ ప్రకాశ్ దాస్‌పై లక్షా 19 వేల 836 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కాగ్ గిరీశ్ చంద్ర
ముఖ్యమంత్రి రేసులో కాగ్ గిరీష్ ముర్ము పేరు కూడా బలంగా వినిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
ప్రతాప్ సారంగి
'మోదీ ఆఫ్ ఒడిశా'గా పేరు గాంచిన ఎంపీ ప్రతాప్ సారంగిని 2019 ఎన్నికల్లో బాలాసోర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిదేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. మోదీ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
బైజయంత్ పండా
ఒడిశాకు చెందిన మరో దిగ్గజ నేత, మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికైన కేంద్రపారా ఎంపీ బైజయంత్ పండా కూడా ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ప్రస్తుత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే వీరంతా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం వల్ల ఒడిశా సీఎంగా బీజేపీ కొత్తవారిని పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. నవీన్ పట్నాయక్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎవరినీ తీసుకువస్తుందనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అగ్రనాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తెలిపారు.
'ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు? ఎవరికి ఏ శాఖ?'- దిల్లీలో బీజేపీ నేతల కసరత్తు - BJP Meeting At Delhi
మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం- మిత్ర దేశాల అగ్ర నేతలకు ఆహ్వానం