No Ticket Hate Speech leaders In BJP : బీజేపీ శనివారం విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన పలువురు నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ప్రగ్యా ఠాకూర్, సిట్టింగ్ ఎంపీలైన పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరితో పాటు జయంత్ సిన్హా పేర్లు లేకపోవడం చర్చలకు తావిస్తోంది. ఈ నేతలు పార్లమెంటు లోపలా, వెలుపలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఫైర్‌బ్రాండ్‌కు నో!
మాలేగావ్ పేలుళ్ల కేసులో జైలులో ఉన్న ప్రగ్యా, ఆరోగ్య సమస్యల కారణంతో బయటకు వచ్చి పలు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. గాడ్సేను దేశ భక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం వివాదాస్పదమైంది. ఆ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని, ప్రగ్యా, క్షమాపణలు అడిగినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని అన్నారు.
సారీ చెప్పినా- టికెట్ చేజారే
ఒక వర్గాన్ని బహిష్కరించాలని పిలుపునివ్వడం, దిల్లీ షహీన్ భాగ్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలను ఒక గంటలో క్లియర్ చేస్తానని చెప్పడం ఎంపీ పర్వేశ్ వర్మపై వేటుకు కారణమైంది. మరో ఎంపీ రమేశ్ బిధూరి పార్లమెంటులో బీఎస్పీ లోక్‌సభ సభ్యుడైన డానిష్ అలీని కించపరచేలా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. చివరకు రమేశ్ బిధూరి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో బీజేపీ వీరిని హెచ్చరించింది.
ప్రత్యర్థికి పట్టు చిక్కనివ్వొద్దు- ఈసారి మంత్రం అదే
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని ఎదుర్కొనున్న వేళ ప్రత్యర్థికి ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ ఈసారి వివాదాస్పద నేతలను బరిలోకి దించవద్దని భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి జాబితాలో మొత్తం 33 మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి ఎన్నికల ప్రచారం పూర్తిగా ప్రధానమంత్రి సూచించిన వికసిత్ భారత్ 2047పైనే ఉండాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ వర్గాలకు సూచనలు చేసినట్లు సమాచారం.
అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారు
అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం, బంగాల్లో కొంతమంది బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. తమ ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సిద్ధమయ్యారు. హావ్‌డా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రథిన్ చక్రవర్తి, ఆదివారం సిద్ధేశ్వరి కాళీ ఆలయంలో ప్రార్థనలు చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంభించారు. మరో అభ్యర్థి, నటుడు హిరణ్మయ్ చటోపాధ్యాయ ఘటల్ స్థానం నుంచి ప్రచారం మొదలు పెట్టారు.
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్- వారణాసి నుంచి మోదీ పోటీ
బీజేపీతో ఆర్ఎల్డీ దోస్తీ- ఎన్డీఏ కూటమితో ఎన్నికల బరిలోకి!