New Election Commissioners India : నూతన ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోక్రాట్లు పంజాబ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధు, కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నియామకాలను ప్రకటిస్తూ న్యాయమంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అధికారిక ప్రకటన రాకముందే ఎంపిక కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరీ గురువారం ఉదయమే ఈ పేర్లను బయటపెట్టారు.
నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో అధీర్‌తో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు.
మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌ను కొత్త ఈసీలుగా ఎంపిక చేసింది. ఆ పేర్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం వారిద్దరిని ద్రౌపదీ ముర్ము కొత్త ఎన్నికల కమిషనర్లుగా వారిద్దరిని నియమిస్తున్నట్లు న్యాయమంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం ప్రకటించింది.
'ఈసీ ఎంపిక ప్రక్రియలో లోపాలున్నాయి'
అయితే ఎంపిక కమిటీ భేటీ అనంతరం మీడియాతో మట్లాడారు అధీర్ రంజన్ చౌధరీ. "తొలుత నాకు 212 పేర్లను పంపించారు సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేశ్‌ను ఎంపిక చేశారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ సభ్యులుగా ఉండాలి" అని ఆయన తెలిపారు.
-
VIDEO | “They (the government) gave me the list of 212 names just 10 minutes before the meeting. It was impossible for me to know about the integrity and experience of people named on the list, then and there. I didn't agree with the procedure through which the names have been… pic.twitter.com/WmeqPeq9xw
— Press Trust of India (@PTI_News) March 14, 2024
గత నెలలో ఒక ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు భర్తీ అయ్యాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ (ఈసీ)ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని మినహాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం (మార్చి 15) విచారణ జరపనుంది.