NDA MPs Meet In Parliament : భారత ప్రధానిగా వరుసగా మూడోసారి జూన్ 9వ తేదీ సాయంత్రం నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత ప్రహ్లోద్ జోషి ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకులైన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాసవాన్, హిందూస్థానీ అవామీ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, అనుప్రియ పటేల్‌తోపాటు ఎన్డీయే ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలోనే ప్రధాని మోదీని ఎన్డీఏ లోక్‌సభా పక్షనేతగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రాజ్‌నాథ్ ప్రతిపాదనను బీజేపీ నేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి బలపరిచారు. ఈ క్రమంలో ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారు. అలాగే మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశాయి.
'దేశానికి దశ దిశ అందించిన నేత మోదీ'
1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ దేశానికి ప్రధాని కాలేదని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు. పదేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి సేవలందించిందని వెల్లడించారు. ప్రపంచ దేశాల నేతలు మోదీని ప్రశంసిస్తున్నారని, దేశానికి దశ దిశ నిర్దేశించడంలో మోదీ సఫలమయ్యారని తెలిపారు.
ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారు : చంద్రబాబు
ఎన్డీఏను అధికారంలోకి తేవడానికి ప్రధాని నరేంద్ర మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు ప్రధాని మోదీ కష్టపడ్డారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.
'విజనరీ లీడర్ మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుంది. దూరదృష్టి కలిగిన మోదీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారు. ఆయన నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ 1గా నిలుస్తుంది. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చింది. మోదీ నాయకత్వంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మోదీ నేతృత్వంలో భారత్ పేదరిక రహితంగా మారుతుంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇటీవల విడుదలైన లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీఏ 293 సీట్లు సాధించింది. మెజారిటీ మార్కు 272ను కంటే ఎక్కువ సీట్లు రావడం వల్ల కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కును దాటలేకపోయింది. దీంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో చకచకా పావులు కదిపి ఎన్డీఏ పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.