Mumbai Boat Incident : ఆ ముగ్గురు ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లారు. అక్కడే ఓ ఫిషింగ్ కంపెనీలో చేరారు. పని చేసినా జీతం అందలేదు. చిత్రహింసలకు గురయ్యారు! అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. అయినా ఉపశమనం లభించలేదు. చివరకు యజమాని పడవ దొంగలించారు. ఆరు దేశాల గుండా ప్రయాణించి ముంబయి చేరుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించి పోలీసులకు పట్టుబడ్డారు. అసలేం జరిగింది? వారి కథేంటి?
తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఆంటోనీ(29), నిడిసో డిటో(31), సహయత్త అనీశ్ (29) 2022లో కువైట్‌కు వెళ్లారు. అక్కడ కువైట్ దేశస్థుడైన అబ్దుల్లా షర్హీద్ ఫిషింగ్‌కు చెందిన ఫిషింగ్ కంపెనీలో పనిలో చేరారు. ఆ యజమాని పని చేయించుకుని సరిగా జీతం చెల్లించకపోగా చిత్రహింసలకు గురిచేసేవాడని ఆరోపించారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నించారు. కానీ వారి పాస్‌పోర్టులు షర్హీద్ వద్ద ఉండడం వల్ల కుదరలేదు.
6వేల లీటర్ల డీజిల్ ఉన్న పడవతో పరార్
దీంతో ముగ్గురు స్థానిక అధికారులతో భారత రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరేందుకు ప్రయత్నించారు. కానీ ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఇక తప్పించుకోవడానికి ప్లాన్ వేశారు. ఫిషింగ్‌కు వెళ్తున్నామని చెప్పి 6వేల లీటర్ల డీజిల్‌తో నింపి ఉన్న యజమాని పడవను దొంగలించారు. సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్థాన్ దేశాల గుండా ప్రయాణించి భారత తీరానికి చేరుకున్నారు.
పోలీసుల కేసు
కువైట్ నుంచి ముంబయి గేట్ వే ఆఫ్ ఇండియా సమీపానికి చేరుకున్న ఈ పడవను మంగళవారం సాయంత్రం సముద్ర గస్తీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద పదార్థాలు లభించలేదని చెప్పారు. పాస్‌పోర్ట్ నిబంధనల ప్రకారం పోలీసులు వారిపై అభియోగాలు మోపారు.
నాలుగు రోజులు తిండి లేకుండా!
ముగ్గురిని పోలీసులు కోర్టు ముందు హాజరపరిచారు. ఆ సమయంలో వారి న్యాయవాది సునీల్ పాండే ముగ్గురు క్లిష్ట పరిస్థితులను కోర్టుకు వివరించారు. ముగ్గురు కూడా నిరుపేద కుటుంబాలకు చెందినవారని చెప్పారు. కువైట్‌లోని యజమాని చిత్రహింసలకు గురయ్యారని చెప్పారు. తమ పాస్‌పోర్టులను ఇవ్వకపోవడం వల్ల తప్పించుకునేందుకు యజమాని పడవను దొంగిలించినట్లు ముగ్గురు వ్యక్తులు కోర్టులో అంగీకరించారు. 10 రోజుల పాటు ప్రయాణించామని, రేషన్ ఖాళీ కావడం వల్ల నాలుగు రోజులుగా ఆకలితో ఉన్నామని తెలిపారు.
అయితే గస్తీని దాటుకుని కువైట్ పడవ ముంబయి తీరానికి ఎలా వచ్చిందన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సముద్ర భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. 2008లో కొందరు పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయిలోకి ప్రవేశించి మారణహోమానికి పాల్పడారు.
సముద్రంలో మూడు పడవలు మాయం.. 300 మంది వలసదారులు మిస్సింగ్!
గంగా నదికి పూజ చేసేందుకు వెళ్తుండగా బోటు బోల్తా.. నలుగురు మహిళలు మృతి