Mother And Son Tenth Exam : చదవాలన్న పట్టుదల ఉంటే వయసు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది కర్ణాటకకు చెందిన ఓ మహిళ. కొన్ని కారణాల వల్ల పదో తరగతి పూర్తి చేయలేకపోయిన ఆమె, ఇటీవల కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలు రాసి పాసైంది. కుమారుడు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడవ్వడం వల్ల ఆమె కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి.
హసన్ జిల్లా ఆలూరు తాలూకాలోని చిన్నల్లి గ్రామానికి చెందిన భువనేశ్ భార్య టీఆర్ జ్యోతి(38) ఇటీవల జరిగిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు హాజరైంది. ఆమె కుమారుడు నితిన్, వివేకా కాన్వెంట్లో చదువుకున్నాడు. అతడు కూడా పరీక్షలకు హాజరయ్యాడు. అయితే మే9వ తేదీన 10వ తరగతి ఫలితాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. అందులో జ్యోతితోపాటు నితిన్ కూడా పాసయ్యాడు. జ్యోతి 250 మార్కులతో, నితిన్ 582 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
625/625 మార్కులు
మరోవైపు, బాగల్‌కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టింది. ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలిక, ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది. ఆమె సాధించిన అపూర్వ విజయం గురించి టీచర్లు చెప్పగానే స్వగ్రామం వజ్జరమట్టిలో ప్రజలంతా ఇంటికి చేరుకొని బాలికను అభినందించారు. గ్రామస్థులు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు.
ఈ విజయం అంతా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని తెలిపింది అంకిత. ఉపాధ్యాయులు తనను ఎంతగానో ప్రోత్సహించి సహకరించారని చెప్పింది. ఈ విజయంతో తనకన్నా వాళ్లే ఎక్కువ ఆనందంగా ఉన్నారని తెలిపింది. ప్రీ-యూనివర్సిటీలో సైన్స్‌ను అభ్యసించాలని, ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశాక ఆపై ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవ చేయాలని కోరుకొంటున్నట్లు అంకిత తెలిపింది. ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన బాలికకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బాలాకోట్ డిప్యూటీ కమిషనర్ కేఎం జానకి, జిల్లా పంచాయత్ సీఈవో శశిధర్ అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆమె కుటుంబాన్ని త్వరలో కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఎన్నికలపై మోదీ, రాహుల్ లైవ్ డిబేట్! అగ్రనేతలకు ప్రముఖుల లేఖ - PM Modi Rahul Gandhi Live Debate
పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - Padma Vibhushan Chiranjeevi