Modi On Rahul Gandhi : అమేఠీ నుంచి పారిపోయిన కాంగ్రెస్ యువరాజు వయనాడ్‌లోనూ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఈనెల 26న అక్కడ పోలింగ్ ముగిసిన తర్వాత మరో సురక్షిత స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ, కాంగ్రెస్‌తోపాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'కాంగ్రెస్ యువరాజుకు వయనాడ్‌లోనూ కష్టకాలం కనిపిస్తోంది. యువరాజు, ఆయన బృందం ఈనెల 26న వయనాడ్‌లో జరిగే ఓటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వయనాడ్‌లో పోలింగ్ పూర్తయ్యాక ఈ యువరాజు కోసం సురక్షిత స్థానం కోసం ప్రయత్నించవచ్చు. లేదా మరోచోట నుంచి పోటీ చేయించవచ్చు. ఇండియా కూటమిలోని నేతలు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. యువరాజును కూటమిలోని సహచర పార్టీ నేత, కేరళ ముఖ్యమంత్రి విమర్శించారు. నేను కూడా అలాంటి భాష ఉపయోగించను. కానీ ఆయన అలాంటి భాష వాడారు. ఇదీ వారి పరిస్థితి. అమేఠీ నుంచి ఏ విధంగానైతే పారిపోయాడో అదేవిధంగా వయనాడ్‌ను వదులుకోకతప్పదు' అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
మొదటి దశ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి
లోక్‌సభ ఎన్నికల్లో తొలి విడతలో భారత కూటమిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ప్రధాని మోదీ విమర్శించారు.' తమ కుటుంబాల ప్రయోజన కోసం ఇండియా కూటమిలోకి వచ్చిన అవినీతి నాయకులను ప్రజలు చూశారు. అందుకే మొదటి దశలోనే ఓటర్లు ఇండియా కూటమిని పూర్తిగా తిరస్కరించారని వార్తలు వచ్చాయి. ఎన్నికల ప్రకటనకు ముందే కాంగ్రెస్ నేతల ఓటమిని అంగీకరించారన్నది వాస్తవం. అందుకే లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి గెలుపొందిన కొందరు నేతలు ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి కారణమిదే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 370 ఆర్టికల్ సాకుతో కాంగ్రెస్ కశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయనివ్వలేదు. మరోవైపు మహారాష్ట్ర అభివృద్ధి పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.