Modi On Manmohan Singh : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో ఉన్నా దేశం కోసం పనిచేశారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమన్నారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్పై ప్రశంసలు కురిపించారు.
"ఈ దేశానికి మన్మోహన్‌జీ చేసిన సేవ అపారం. సుదీర్ఘకాలం పాటు రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది. రాజ్యసభలో జరిగిన ఎన్నికల సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. ఓ సభ్యుడిగా తన విధుల విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలోనూ పనిచేశారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శం" అని మోదీ ప్రశంసించారు.
పదవీ విరమణ చేస్తున్నసభ్యులందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి అనుభవాలను కొత్త తరాలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యసభలో 56 మంది సభ్యులు త్వరలోనే పదవీ విరమణ చేస్తున్నారు. వారందరికీ దిల్లీలోని ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫొటోలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఛైర్మన్ నివాసంలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు.
'బ్లాక్ పేపర్- మాకు దిష్టిచుక్క'
కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గురువారం విడుదల చేసిన బ్లాక్ పేపర్‌పై మోదీ స్పందించారు. "ఆ పత్రం మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే. మాపై చెడు చూపు పడకుండా చేస్తుంది. ప్రతిపక్షాల చర్యను మేం స్వాగతిస్తున్నాం" అని అన్నారు. ఆ పత్రం విడుదల చేసినందుకు ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. కొన్నిసార్లు ప్రతిపక్ష ఎంపీలు ధరించే నల్లని వస్త్రాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. కొందరు సభ్యులు నల్ల దుస్తులతో వచ్చినప్పుడు రాజ్యసభలో ఫ్యాషన్ షో చూశామంటూ చురకలు అంటించారు.