Modi On Congress In Bihar : కాంగ్రెస్ మేనిఫెస్టోలో బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయని, అందులో ముస్లిం లీగ్ భావజాలం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బిహార్‌లోని నవాడా జిల్లాలో ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ, హస్తంపార్టీపై విమర్శలు గుప్పించారు. అలాగే ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని జమ్ముకశ్మీర్‌లో ఎందుకు అమలు చేయలేదని మోదీ ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదు?
'కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పదవి అంటే చిన్న విషయం కాదు. ఆర్టికల్ 370కి రాజస్థాన్‌కు సంబంధం లేదని ఆయన భావిస్తున్నారు. ఇది తుక్డే - తుక్డే ముఠా మనస్తత్వం. రాజస్థాన్, బిహార్‌తో సహా దేశం నలుమూలల నుంచి భద్రతా సిబ్బంది జమ్ము కశ్మీర్లో పోరాడుతూ తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. వారిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని జమ్ము కశ్మీర్లో ఎందుకు అమలు చేయలేదు? అది మోదీ హయాంలోనే సాధ్యమైంది. అంతేకాకుండా ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు సనాతన ధర్మాన్ని కించపరిచే పనిలో నిమగ్నమై ఉన్నాయి' అని ప్రధాని మోదీ విమర్శించారు.
ఇండియా కూటమి నేతలకు భయం
ప్రజా సంక్షేమ పథకాలపై 'ఇండి' కూటమికి అంత విద్వేషం ఎందుకని మోదీ నిలదీశారు. ప్రభుత్వ సొమ్ముతో కాకుండా ప్రజా విరాళాలతో అయోధ్యలో ఆలయాన్ని నిర్మించినా, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు రాలేదని మోదీ గుర్తు చేశారు. రామ నవమి పర్వదినం సమీపిస్తోందని, వారి పాపాలను మర్చిపోవద్దని సూచించారు.
'మోదీ గ్యారంటీలు చూసి ఇండియా కూటమి నేతలు కలవరపడుతున్నారు. ఈ హామీలు వారికి నచ్చడం లేదు. మోదీజీ ఇచ్చే హామీలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని ఇండియా కూటమికి చెందిన ఓ పెద్ద నాయకుడు అన్నారు. మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? మోదీ గ్యారంటీలు చూసి మీరు ఆందోళన చెందుతున్నారా? గ్యారంటీలు ఇవ్వడం ఏమైనా నేరమా? 24 గంటలపాటు పని చేస్తానని నా దేశ ప్రజలకు చెబితే అది నేరమా? మోదీ గ్యారంటీలు ఇవ్వడం వెనక ఆ హామీలను పూర్తిగా అమలు చేస్తామన్న నమ్మకం ఉంది. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని హామీ ఇచ్చాం. చేసి చూపించాం. ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేయకుండా నన్ను బహిష్కరించాలని చూస్తున్నారు. మోదీ ఊబిలో కూరుకుపోయే వ్యక్తి కాదు. కష్టపడి పనిచేసేందుకే జన్మించాను' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఆధారాలున్నాయా?
ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మానికి వ్యతిరేకులు అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు." నేను హిందువుని కాని అని ఆధారాలు ఏమున్నాయి? నా ఇంట్లో ఒక గుడి ఉంది. బీజేపీ నేతలు తమను దేవుడిగా భావిస్తున్నారా? తమను తాము దేవుడితో పోల్చుకోవద్దు. దేవుడు అన్నీ చూస్తున్నారు. అందరూ అక్కడికి వెళ్లాల్సిందే" అని తేజస్వి యాదవ్ మాట్లాడారు.
సేవకుడి మృతదేహం వద్ద ఆవు కన్నీరు- శ్మశానానికి వెళ్లి కూడా! - Cow At Owner Funeral