Missing Boy Found After 20 Years : పదేళ్ల వయసులో అదృశ్యమైన కుమారుడు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. అది కూడా కాషాయ వస్త్రాల్లో ఒక సన్యాసిలా మారి భిక్ష కోసం ఇంటికి వచ్చాడు. అతడిని చూసిన తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. రెండు దశాబ్దాల తర్వాత కనిపించిన తమ కుమారుడు ఇక ఇంటి వద్దే ఉంటాడని అనుకున్నారు. కానీ, ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లాడు. తాను సన్యాసిగా ఒక ముఖ్యమైన ఆచారాన్ని నేరవేర్చడానికే ఇక్కడికి వచ్చానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారి సంతోషం క్షణాల్లో ఆవిరైంది.
వివరాల్లోకి వెళ్తే!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి చెందిన ఓ కుటుంబం దిల్లీలో నివసించేది. 2002లో ఆ కుటుంబానికి చెందిన పదేళ్ల గోపిచంద్ ఆకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆ బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గోపిచంద్పై ఆశలు వదులుకున్నారు. ఇదిలా ఉండగా దాదాపు 10 రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ బహదుర్పుర్లోని ఖరౌలీ గ్రామంలో ఓ వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో సారంగి (సంగీత వాయిద్యం)తో భిక్షం వేయమని అడిగాడు. అతడిని చూసిన కుటుంబ సభ్యులు గోపిచంద్‌ను గుర్తుపట్టారు. పొట్టపై పైన ఉన్న శస్త్రచికిత్స గుర్తులను చూసి దిల్లీలో ఉన్న అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
అమేఠీకి వచ్చిన అతడి తల్లిదండ్రలు గోపిచంద్‌ను చూసి సంతోషించారు. వెంటనే తండ్రి వెళ్లి తన కుమారుడిని కౌగిలించుకున్నాడు. అయితే గోపిచంద్ మాత్రం తన కుటుంబంతో ఉండేందుకు రాలేదని, సన్యాసిగా జీవితంలో ఒక ముఖ్యమైన ఆచారాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. తన గురువు గోరఖ్‌నాథ్ అని చెప్పాడు. తల్లి భిక్ష పెడితేనే తన జీవితం పరిపూర్ణమవుతుందన్న ఉద్దేశంతో కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చినట్లు తెలిపాడు. రాజా భర్థరీ అనే జానపద పాటను పాడుతూ తల్లిని భిక్ష ఇవ్వాలని వేడుకున్నాడు. అయితే, దానికి తల్లి నిరాకరించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామస్థులు సన్యాసిని ఇంటివద్దనే ఉండిపోమని అడిగారు. అతడిని ఒప్పించే ప్రయత్నం చేశారు.
అయితే గ్రామస్థులు ఎంత నచ్చజెప్పినా ఆ సన్యాసి వినలేదు. తనకు భిక్ష లభించకపోతే ఇంటి గుమ్మానికి ఉన్న మట్టి తీసుకుని వెళ్తాను కానీ, సన్యాసి జీవితం విచ్ఛిన్నం కానివ్వనని తేల్చిచెప్పాడు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీశారు. అందులో ఆ సన్యాసి సారంగి అనే వాయిద్యాన్ని వాయిస్తూ గురు గోరఖ్‌నాథ్ కథను పాట (భర్థరీ అనే జానపద గేయం) పాడుతున్నాడు.
'అతడు కావాలనే ఇంటికి వచ్చాడు!'
భర్థరీ అనేది ఒక చారిత్రాత్మక జానపద గేయం. దీన్ని ఉత్తర భారతదేశంలో వివిధ రకాలుగా ఆలపిస్తారు. ఈ జానపద కథ రెండు భాగాలుగా ఉంటుంది. ఈ కథలో జీవితంపై విరక్తి కలిగిన భర్థరీ అనే రాజు ఉంటాడు. అతడికి ఎలాంటి భోగభాగ్యాలపై ఆసక్తి ఉండదు. దీంతో తనకు దీక్ష ప్రసాదించమని గురు గోరఖ్‌నాథ్‌ను ప్రార్థిస్తాడు. అయితే భర్థరీ రాజరిక స్వభావాన్ని చూసిన గోరఖ్‌నాథ్, అతడికి దీక్ష ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఒకవేళ దీక్ష తీసుకోవాలని అనుకుంటే, తన రాణిని అమ్మ అని సంభోదించి భిక్ష పెట్టమని అడగాలని షరతు విధిస్తాడు. దీంతో సన్యాసి వేషంలో రాజు తన రాజభవనం తలుపు వద్ద దీపం వెలిగించి భిక్ష అడుగుతాడు. చివరకి భర్థరీకి భిక్ష లభిస్తుంది. అనంతరం గోరఖ్‌నాథ్ వద్దకు తిరిగి వెళ్లి, దీక్ష పొందుతాడు. అయితే ఇదే ప్రక్రియలో భాగంగా సన్యాసి గోపిచంద్గా తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి స్వస్థలానికి వచ్చినట్లు స్థానికులు అనుకుంటున్నారు.
క్యాన్సర్ ఉందని ఎమోషనల్ బ్లాక్మెయిల్- విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం
జపాన్ నుంచి వచ్చి భారతీయ నృత్యంలో ప్రావీణ్యం- స్వదేశంలో విద్యార్థులకు శిక్షణ