Mango Special Recipes for Summer Season : పండ్లలో రారాజుగా చెప్పుకొనే మామిడిని ఆస్వాదిస్తే ఆ కిక్కే వేరు. అయితే.. మామిడిని చాలా మంది నేరుగా లాగిస్తారు. లేదంటే లస్సీ, సలాడ్స్ వంటివి తయారు చేసుకుంటారు. కానీ.. మామిడితో పులావ్ చేయొచ్చని మీకు తెలుసా? జిలేబీ కూడా తయారు చేయొచ్చని తెలుసా? తక్కువ మందికి మాత్రమే ఈ రెసిపీ తెలిసి ఉంటుంది. మీరు ఇప్పటి వరకూ ట్రై చేయకపోతే మాత్రం ఈ సారి తప్పకుండా టేస్ట్ చేయండి. మరి.. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మ్యాంగో జిలేజీ(Mango Jalebi) :
కావాల్సిన పదార్థాలు :
- పండిన మామిడికాయ - 1
- చక్కెర - 200 గ్రాములు
- కేసర్ - 1 గ్రాము
- వాటర్ - 250 గ్రాములు
- మైదా - 200 గ్రాములు
- నెయ్యి - 300 గ్రాములు
- తరిగిన డ్రై ఫ్రూట్స్- 1 కప్పు.
తయారీ విధానం :
- మామిడి జిలేబీలను ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ముందురోజే కలిపి పులియబెట్టుకుంటే జిలేబీలు సూపర్‌గా వస్తాయి! కాబట్టి ఇందుకోసం.. మీరు ఒక రోజు ముందుగానే మైదా, తగినంత నీటిని కలిపి పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇక నెక్ట్స్ డే మామిడి జిలేబీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్రలో చక్కెర, అందుకు తగినంత వాటర్ వేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం వచ్చాక దానిలో కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి.
- ఇప్పుడు పండి మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత మరో పాన్‌లో నెయ్యి వేసి కాస్త హీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు మామిడి ముక్కలను.. ముందురోజు ప్రిపేర్ చేసుకున్న పిండిలో ముంచితీసి పాన్ మీద వేసి వేయించుకోవాలి.
- అలా వేయించిన మామిడికాయ ముక్కలను చక్కెర పాకంలో ముంచి బయటకు తీయండి.
- ఆపైన తరిగిన డ్రై ఫ్రూట్స్ చల్లి వేడి వేడిగా వడ్డించండి. అంతే.. నోరూరించే మ్యాంగో జిలేబీలు రెడీ!
మండే వేసవిలో చల్లచల్లని లస్సీ తాగేద్దామా...!
మామిడి పులావ్(Mango Pulao) :
కావాల్సిన పదార్థాలు :
- 1 కప్పు బాస్మతి బియ్యం
- 1 పండిన మామిడికాయ
- 1 టేబుల్ స్పూన్ బాదం
- 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు
- 1 టేబుల్ స్పూన్ కిస్మిస్
- 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
- 1/4 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క
- 1/4 టేబుల్ స్పూన్ లవంగాలు
- 1/4 టేబుల్ స్పూన్ జీరా
- 10 - యాలకులు
- బే ఆకు
- కరివేపాకు
- రుచికి తగినంత ఉప్పు
మ్యాంగో పులావ్ తయారీ విధానం :
- ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 2 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. ఆలోపు మీరు మామిడి కాయను చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్లో వేసి మూడొంతులు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటర్ తొలగించి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు మరో పాత్ర పొయ్యిమీద పెట్టి నెయ్యి, జీరా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, కరివేపాకు, లవంగాలు, బే ఆకు వంటివన్నీ వేసి ఆ మిశ్రమాన్ని కాస్త వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మిక్స్ చేయండి.
- అనంతరం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి కలిపి మూతపెట్టుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉంచి స్టౌ పై నుంచి దించేసుకోవాలి.
- అంతే.. వేడి వేడిగా ఉండే టేస్టీ మ్యాంగో పులావ్ రెడీ!