Man Marry Robot : రాజస్థాన్‌లోని జయపుర జిల్లాకు చెందిన ఓ ఇంజినీర్ రోబోను పెళ్లి చేసుకోబోతున్నారు. ఏంటి రోబోతో పెళ్లి అని షాకైపోతున్నారా? కానీ మీరు చదివింది నిజమే! రోబోలంటే ఎంతో ఆసక్తి ఉన్న ఆయన ప్రస్తుతం రోబోతో ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వివాహం చేసుకోనున్నారు.
జిల్లాలోని సీకర్ నివాసి అయిన సూర్య ప్రకాశ్‌కు చిన్నప్పటి నుంచి రోబోలపైనే ఆసక్తి. కానీ అతడి తల్లిదండ్రులకు మాత్రం సూర్య ప్రకాశ్ దేశానికి సేవ చేయాలని కోరుకున్నారు. దీంతో స్కూలింగ్ పూర్తయ్యాక నేవీలో చేరడం కోసం సూర్యప్రకాశ్ సిద్ధమయ్యారు. అనంతరం పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేవీకి ఎంపికయ్యారు.
అయితే చిన్నప్పటి నుంచి రోబోటిక్స్‌పై మక్కువ పెంచుకున్న సూర్య ప్రకాశ్ మళ్లీ, తనకు ఇష్టమైన రోబోటిక్స్ వైపు వెళ్లాలని అనుకున్నారు. సూర్య అభిరుచిని చూసిన కుటుంబ సభ్యులు అటువైపు ప్రోత్సహించారు. తర్వాత సూర్య ప్రకాశ్ అజ్మేర్లోని ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం రోబోటిక్స్లోకి చేరారు. ఆ సమయంలో చాలా ప్రాజెక్టుల్లో వర్క్ చేశారు. ఇప్పుడు రోబో గిగాతో ప్రేమలో పడ్డారు సూర్య ప్రకాశ్. దాదాపు రూ.19 లక్షల వ్యయంతో గిగా రోబో రూపొందుతోంది. తమిళనాడులో తయారీ అయ్యాక, దిల్లీలో ఈ రోబోకి ప్రోగ్రామింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో మాట్లాడారు సూర్య ప్రకాశ్.
"నేను గిగా రోబోను అన్ని ఆచార వ్యవహారాలతో పెళ్లి చేసుకుంటా. నా కుటుంబసభ్యులు అంతా వివాహ వేడుకలో పాల్గొంటారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు ముందు చెప్పగా షాకయ్యారు. తర్వాత అంతా ఒప్పుకున్నారు. గిగా ప్రోగ్రామింగ్‌కు దాదాపు రూ.5లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ప్రోగ్రామింగ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మనకు కావాలంటే హిందీ ప్రోగ్రామింగ్‌ను కూడా యాడ్ చేయవచ్చు. గిగా ఎనిమిది గంటలు పని చేయగలదు. హలో చెబుతుంది, నీటిని అందిస్తుంది, అతిథులను స్వాగతించడం మొదలైన పనులు చేస్తుంది."
-- ఈటీవీ భారత్‌తో సూర్య ప్రకాశ్
ఇజ్రాయెల్ నుంచి వచ్చాక!
తాను సుమారు 400 రోబోటిక్స్ ప్రాజెక్టుల్లో పనిచేశానని ఇంజినీర్ సూర్య ప్రకాశ్ తెలిపారు. కరోనా సమయంలో జయపుర సవైమాన్ సింగ్ ఆస్పత్రిలో రోబోల ద్వారా రోగులకు మందులు, ఆహారాన్ని అందించినట్లు చెప్పారు. అదే సమయంలో టచ్‌లెస్ ఓటింగ్ రోబో యంత్రాన్ని కూడా తయారు చేసినట్లు చెప్పారు. త్వరలోనే ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి పని చేయబోతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చాక సైన్యంలో చేరడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.