Congress Reactions on Elections Results : లోక్‌సభ ఫలితాల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజారిటీ ఇవ్వకపోయినా ప్రధాని నరేంద్ర మోదీకి ఇది రాజకీయంగా, నైతికంగా పరాజయమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు ఇది ప్రజల విజయమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే. యుద్ధం చేశామని, తమ పోరాటాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికలకు ముందు అన్ని వ్యవస్థలు తమకు వ్యతిరేకంగానే పనిచేశాయని గుర్తు చేశారు. అయినా సరే కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని కొనియాడారు. ఇండియా కూటమి తదుపరి కార్యచరణపై బుధవారం సమావేశం కానున్నట్లు తెలిపారు.
"రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజలు కలసికట్టుగా పోరాటం చేస్తారని నేను అనుకున్నాను. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో చేశారు. ఇండియా కూటమి భాగస్వాములను మేం గౌరవిస్తాం. ఆ కూటమి దేశం కోసం పేదలకు అనుకూలమైన విజన్‌ను అందించింది. ఈ రాజ్యాంగంపై దాడిని ప్రతిఘటించిన ప్రజలపై ఎంతో గర్వంగా ఉంది. ఎన్నికలకు ముందు అన్ని వ్యవస్థలు మాకు వ్యతిరేకంగానే పని చేశాయి. అయినా సరే కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు,కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారు. "
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అలాగే పాత మిత్రులైన పీడీపీ, జేడీయూతో సంప్రదింపులు జరుపుతారా? అని అడగ్గా.. "బుధవారం మా ఇండియా కూటమి నేతలతో సమావేశం ఉంటుంది. వారితో సంప్రదింపులు చేయకుండా ఎలాంటి ప్రకటనలు చేయం" అని స్పష్టంచేశారు. అలాగే కేరళలోని వయనాడ్‌తో పాటు యూపీలోని రాయ్‌బరేలీ రెండు సీట్లలో సాధించిన విజయం గురించి స్పందించారు. "నేను రెండు స్థానాల్లో ఉండటం కుదరదు. దానిపై ఆలోచిస్తున్నాను. ఏ సీటు వదులుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని వెల్లడించారు.
ప్రజల్లో మోదీకి వ్యతిరేకత
ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని, ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో తాము తొలి విజయం సాధించామని ఖర్గే పేర్కొన్నారు."ఈరోజు దేశంలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు ప్రజల ఫలితాలు. ఇది ప్రజల విజయం. ఇది ప్రజాస్వామ్య విజయం. ఈ పోరు మోదీ వర్సెస్ ప్రజలని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఈసారి ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కానీ ప్రజలకు మోదీకి వ్యతిరేకంగా ఉన్నారని ఆదేశం వచ్చింది. ఇది ఆయన (మోదీ)కు రాజకీయ, నైతిక పరాజయం. కాంగ్రెస్, ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొందని మీకు(ప్రజలు) తెలుసు. ప్రభుత్వం యంత్రాంగం అడుగుడుగునా మాకు అడ్డంకులు సృష్టించింది" అని మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు అన్నారు.
'మోదీ వెంటనే రాజీనామా చేయాలి'
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓడిపోయారని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 'ప్రజల విశ్వసనీయతను ప్రధాని మోదీ కోల్పోయారు. అందుకే వెంటనే మోదీ రాజీనామా చేయాలి. అధికారంలో ఇండియా కూటమి ఉండేలా నేను ప్రయత్నిస్తాను. మా తల్లులు, సోదరీమణులపై దుష్ప్రచారం చేశారు. అయినప్పటికీ సందేశ్‌ఖాలీ ఉన్న బసిర్‌హత్ లోక్‌సభ స్థానాన్ని మేము గెలుచుకున్నాం' అని మమతా బెనర్జీ అన్నారు
బీజేపీకి ఎదురుదెబ్బ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులను ప్రజలు తిప్పికొట్టరని సీపీఐ(ఎం) తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై బీజేపీ దాడి చేసిందని, అందుకే ప్రజలు ఈ ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంది. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం నిలబడ్డారని సీపీఐ(ఎం) అభినందించింది.
'మోదీకి నైతికంగా ఓటమి'- లోక్‌సభ రిజల్ట్స్‌తో 'ఇండియా'కు నయా జోష్ - Lok Sabha Elections results 2024