International Women's Day 2024 : మార్చి 8న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ఈ రోజు గౌరవించుకుంటాం. విభిన్న రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళామణులందరినీ సత్కరించుకుంటాం. కాగా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, విజయాలను గౌరవించడంతో పాటు స్త్రీలపై హింస, వారికి సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన అంశాలపై వాదించాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తుంది. అయితే, అసలు మార్చి 8వ తేదీనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న ప్రస్థానం ఏంటి ? ఇక ఏడాది మహిళా దినోత్సం థీమ్ ఏంటి? అనే వివరాలు ఈస్టోరీలో తెలుసుకుందాం.
మహిళా దినోత్సవ ప్రస్థానం: ఒక కార్మిక ఉద్యమం నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పుట్టుకొచ్చింది. గతంలో ఎంతోమంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇక దీని వెనుక ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1908లో అమెరికాలోని న్యూయార్క్ సిటీకి చెందిన 15వేల మంది మహిళలు తమకు పని గంటలను తగ్గించాలని, ఓటు వేసే హక్కును కల్పించాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. అప్పుడు ఆ విషయం ప్రభుత్వానికి తెలియడంతో సంవత్సరం తర్వాత అంటే 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.
ఆ సమయంలో ఈ దినోత్సవం కేవలం ఒక దేశానికే చెందినది కాదని క్లారా జెట్కిన్ అనే మహిళ ఆలోచన చేసింది. దీన్ని ప్రపంచ స్థాయిలో అన్ని దేశాల్లోని మహిళలకు చెందినదిగా ప్రకటించాలని పోరాటం చేశారు. ఈ క్రమంలో 1910లో కోపెన్ హాగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ కార్యక్రమంలో జర్మన్ సామ్యవాది అయిన క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చాలని ప్రతిపాదన చేసింది. అప్పుడు ఆ సదస్సులో 17 దేశాల నుంచి 100 మంది మహిళలు ఈ ప్రతిపాదనను అంగీకరించారు. అలా తొలిసారిగా.. 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా... ఇలా ఎన్నో దేశాల్లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలైంది.
మార్చి 8 నాడే మహిళా దినోత్సం ఎందుకంటే?: ఇక ప్రతి సంవత్సరం మార్చి 8న.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ఒక కారణం ఉంది. అది ఏంటంటే.. 1917లో రష్యా మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా చాలా నష్టపోయారు. ముఖ్యంగా ఆహారం, ప్రశాంతత లేక తల్లడిల్లారు. దాంతో వారంతా కలిసి నిరసనకు దిగారు. వారి సమ్మె ప్రభావంతో రష్యా చక్రవర్తి నికోలస్ సింహాసనాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పడింది. అప్పుడు ఆ ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును కల్పించింది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8నాడే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇకపోతే.. ఐక్యరాజ్యసమితి 1975వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి అన్ని దేశాలూ ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం స్టార్ట్ చేశాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్ విషయానికొస్తే.. ఈ సంవత్సరం థీమ్ 'Invest in Women: Accelerate Progress'. అంటే మహిళాభ్యుదయానికి పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పురోభివృద్ధికి సహకరించాలనేది ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.
ఉమెన్స్ డే: మరపురాని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
విమెన్స్ డే స్పెషల్: స్త్రీలు కొంచెం ఎక్కువ..! ఎందుకో తెలుసా..!