India Corruption Ranking 2023 : అవినీతి సూచీలోని 180దేశాల్లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఓ నివేదిక విడుదల చేసింది. ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలు తీసుకొని సున్నా నుంచి 100 మధ్య పాయింట్లు కేటాయించింది. సున్నా అయితే అవినీతి ఎక్కువని వంద అయితే అవినీతి రహితమని పేర్కొంది. 2023 ఏడాదికి భారత్‌కు 39పాయింట్లు దక్కాయి. అదే 2022లో 40 పాయింట్లు వచ్చాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్, శ్రీలంకలు వరుసగా 133, 115 ర్యాంకుల్లో నిలిచాయి. చైనా 76వ స్థానంలో ఉంది.
అవినీతి రహిత దేశాల్లో మొదటి స్థానంలో డెన్మార్క్
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 71శాతం దేశాలు అవినీతి సూచీలో 45కంటే తక్కువ పాయింట్లతో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో న్యూజిలాండ్ మూడు, సింగపూర్ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి. ఉత్తరకొరియా 172వ ర్యాంకులో, మయన్మార్, అఫ్గానిస్థాన్ సంయుక్తంగా 162వ స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా అవినీతిరహిత దేశంగా డెన్మార్క్ నిలిస్తే రెండో స్థానంలో ఫిన్‌లాండ్ నిలిచింది. అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా నిలిచింది.
'అవినీతి సూచీలో భారత్ స్కోర్‌లో హెచ్చుతగ్గులు'
ప్రపంచ అవినీతి సూచీలో భారత్ స్కోర్‌లో హెచ్చుతగ్గులు సాధారణ స్థాయిలో ఉన్నాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. టెలికమ్యూనికేషన్ బిల్లు వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది. 2023కు గాను ప్రపంచ అవినీతి సూచీలో భారత్ 93వ స్థానం దక్కించుకోగా, 2022లో 85వ స్థానంలో నిలిచింది.
అవినీతి సూచీలో 133 స్థానంలో పాక్
అవినీతి సూచీలో పాకిస్థాన్, శ్రీలంక దేశాలు వరుసగా 133, 115 స్థానాల్లో నిలిచాయి. ఆ రెండు దేశాలు రాజకీయ అస్థిరత్వం, రుణసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. అయితే రెండు దేశాల్లోనూ సమర్థమైన న్యాయవ్యవస్థ ఉందని, ఫలితంగా ప్రభుత్వాన్ని సరిగా నడిపించడంలో తోడ్పతుందని నివేదిక పేర్కొంది. పౌరులందరూ సమాచార హక్కును ఉపయోగించుకునేవిధంగా ఆర్టికల్ 19 ఏ కింద ఆ హక్కును మరింత బలోపేతం చేయడానికి పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం పనిచేసినట్లుగా నివేదిక వెల్లడించింది.
సీఎం కార్లు సీజ్ చేసిన ఈడీ- సోదాల్లో రూ.36లక్షలు స్వాధీనం- భార్యకు పగ్గాలు!
'దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో CAA అమలు'- కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు