Haryana Polls 2024 Counting : హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలో 90 శాసనసభ స్థానాలు ఉండగా 1031 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హరియాణాలో హ్యాట్రిక్ విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది. హరియాణా హస్తం పార్టీదేనని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, ఐఎన్ఎల్డీ - బీఎస్పీ, జేజేపీ-ఆజాద్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగ్గా 1031 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 2 కోట్ల మందికిపైగా ఓటర్లలో 67.90 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మా పార్టీదే విజయం
సీఎం సైనీ లాడ్‌వా నుంచి, ప్రతిపక్ష నేత హుడ్డా గర్హి సంప్లా-కిలోయ్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ జులానా నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు. హరియాణాలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం నాయబ్ సింగ్ సైనీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చాక ఈవీఎమ్‌లను కాంగ్రెస్ తప్పుపడుతుందని తెలిపారు. హరియాణాలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడ్డా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో సీఎం రేసులో హుడ్డానే ముందు వరుసలో ఉన్నారు. ఐఎన్ఎల్డీ - బీఎస్పీ కూటమి, జననాయక్ పీపుల్స్ పార్టీ జేజేపీ నేత దుశ్యంత్‌సింగ్ చౌతాలా కూడా తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు తమ మద్దతు లేకుండా హరియాణాలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-41 , కాంగ్రెస్-28, జేజేపీ-6 స్థానాలు దక్కించుకోగా హరియాణా లోక్‌హిత్ పార్టీ, ఐఎల్ఎన్డీ చెరో చోట నెగ్గాయి. జేజేపీలో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనీని సీఎంగా బీజేపీ నియమించాక, కమలదళంతో ఉన్న బంధాన్ని జేజేపీ తెంచుకుంది.