Girl Live With Dead Body In UP : ఆత్మహత్య చేసుకున్న స్నేహితురాలి మృతదేహాన్ని గదిలో పెట్టుకుని 3రోజులు గడిపింది ఓ యువతి, ఆమె కుటుంబం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మథుర జిల్లాలోని మహువా గ్రామంలో వెలుగు చూసింది.
ఇదీ జరిగింది
ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే హేమ, ఛద్గావ్‌కు చెందిన 26 ఏళ్ల గంగా దేవీ ఇద్దరు స్నేహితులు. వీరిలో గంగా దేవీకి వివాహం జరగ్గా భర్తతో మనస్ఫర్థల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి హేమ కుటుంబం వద్దకు వచ్చి ఉంటుంది. ఈ క్రమంలోనే గతనెల 29న గంగ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలుసుకున్న హేమ, ఆమె కుటుంబం విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా, గదిలోనే ఓ మంచంపై మృతదేహాన్ని ఉంచి లోపలి నుంచి గడియ పెట్టుకుంది. అలా మూడు రోజులు మృతదేహం వద్దే గడిపింది.
'భయంతో చెప్పలేదు'
మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు హేమ కొన్ని రకాల సెంట్లను గదిలో స్ప్రే చేసింది. మూడు రోజుల తర్వాత దుర్వాసన విపరీతంగా పెరిగి చుట్టుపక్కలంతా వ్యాపించింది. దీనిని పసిగట్టిన గ్రామస్థులకు అనుమానం రావడం వల్ల వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫరా స్టేషన్ పోలీసులు, హేమ ఉంటున్న గది తలుపులను పగులగొట్టారు. అనంతరం రూంలో బెడ్‌పై పడి ఉన్న గంగా దేవీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం పరీక్షల కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే గంగ చనిపోయిన విషయాన్ని బయటకు చెప్పకుండా 3 రోజులు హేమ, ఆమె కుటుంబం ఎందుకు అలాగే ఉండిపోయింది? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, కేవలం భయం కారణంగానే తాము ఈ విషయాన్ని దాచి ఉంచామని హేమ చెబుతోంది.
'ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు కొందరు గ్రామస్థులు మాకు సమాచారం ఇచ్చారు. మేం వెంటనే అక్కడకు చేరుకున్నాం. గది తలుపులు బద్దలు కొట్టి గంగా దేవీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. డెడ్‌బాడీని పోస్ట్ మార్టం పరీక్షల కోసం పంపాం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. పోస్ట్ మార్టం పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఇది హత్యా లేదా ఆత్మహత్య అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాగా, గంగ గత కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ తన స్నేహితురాలు హేమ దగ్గరే ఉంటోంది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈమె భర్త దివ్యాంగుడు' అని మథుర నగర అదనపు ఎస్పీ డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు.
మహిళలకు నెలకు ఫ్రీగా రూ.1500- ఆ రాష్ట్రంలో రూ.వెయ్యి- వచ్చే నెల నుంచే అమలు!
అమెరికాలో మంచు తుపాను బీభత్సం- ప్రధాన రహదారులు బంద్- 72 కి.మీల వేగంతో చలిగాలులు