Andhra Pradesh Elections 2024 Result Counting Process: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.. ఇక, రిజల్ట్ మాత్రమే బాకీ. దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలుస్తుందంటూ మెజారిటీ సర్వేలు తేల్చాయి. దీంతో జూన్ 4వ తేదీన వెల్లడయ్యే అసలు ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అయితే.. ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఓట్లను ఎలా లెక్కిస్తారో.. లోపల ఎంత తతంగం ఉంటుందో మీరెప్పుడైనా చూశారా? ప్రతీ రౌండ్ ఫలితం బయటకు ఎలా వస్తుందో తెలుసా? "తెలియదు" అంటే మాత్రం.. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
కౌటింగ్ కేంద్రం అదే..: పోలింగ్ జరిగిన రోజున ఈవీఎంలను.. ఆ నియోజకవర్గంలోనే ఒక ప్రాంతంలో భద్రపరుస్తారు. దాన్నే "స్ట్రాంగ్ రూమ్" అంటారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం కూడా అదే. అందులోనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ టేబుల్స్ 14 ఉంటాయి. ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం ఉంచి ఓట్లను లెక్కిస్తారు. ఈ 14 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్నే.. ఒక రౌండ్ రిజల్ట్ అంటారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల సంఖ్యను బట్టి.. రౌండ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
ఈవీఎం ఎలా తెరుస్తారు?: EVM యంత్రంలోని రిజల్ట్ విభాగానికి ఒక సీల్ ఉంటుంది. ముందు దాన్ని తొలగిస్తారు. EVM బయటి కప్పును మాత్రమే ఓపెన్ చేస్తారు. లోపలి భాగాన్ని తెరవరు. ఆ తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. అనంతరం.. లోపల ఒక బటన్ తీరుగా మరో సీల్ ఉంటుంది. దాన్ని తొలగిస్తే లోపల రిజల్ట్స్ బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్..: కౌంటింగ్‌లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. EVMల కోసం ఏర్పాటు చేసే 14 టేబుళ్లు కాకుండా.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా మరో టేబుల్ ఉంటుంది. ఈ పోస్టల్ ఓట్లు లెక్కించిన అరగంట తర్వాత.. EVM ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఒకవేళ పోస్టల్ ఓట్లు అరగంటలో పూర్తికాకపోయినా.. EVM ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు.
కౌంటింగ్ ఏజెంట్లు.. అభ్యర్థుల సమక్షంలో..: ఓట్ల లెక్కింపు మొదలు.. రిజల్ట్ అనౌన్స్ వరకు బాధ్యత మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్‌దే. ఈ అధికారి.. వివిధ పార్టీలకు చెందిన కౌటింగ్ ఏజెంట్లు, పోటీచేసిన అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. EVM తెరుస్తున్నప్పుడు.. దాని సీల్ సరిగా ఉందా లేదా? అని ఏజెంట్లకు చూపిస్తారు. వారు సరిగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే ఓపెన్ చేస్తారు. ఏదైనా తేడా ఉందని భావిస్తే.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. ఓపెన్ చేసిన EVMలోని ఓట్ల ఫలితాలను వారికి చూపించి.. వారు సంతృప్తి చెందిన తర్వాత.. వారి సంతకాలు తీసుకుంటారు.
సూపర్ వైజర్లు.. అబ్జర్వర్లు..: ప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద.. సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత.. ఏజెంట్లు సంతృప్తి చెందిన తర్వాతనే రిజల్ట్ ప్రకటిస్తారు. ఏ రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అనే వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డు మీద రాస్తారు. ఆ తర్వాతే అనౌన్స్ చేస్తారు. ఇలా జరిగే కౌంటింగ్ మొత్తం వీడియో తీసి భద్రపరుస్తారు.
వీవీ ప్యాట్ల లెక్కింపు..: ఓటు వేస్తున్నప్పుడు మొరాయించినట్టుగానే.. కౌంటింగ్ సమయంలో కూడా కొన్ని EVMలు మొరాయిస్తాయి. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోతే.. అప్పుడు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. అభ్యర్థుల గుర్తుల వారీగా బాక్సులు ఏర్పాటు చేసి, వారికి పోలైన స్లిప్పులను అందులో వేస్తారు. ఆ తర్వాత లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్ యంత్రంలోని స్లిప్పులు లెక్కబెట్టాలంటే.. దాదాపు గంట పట్టే ఛాన్స్ ఉంది. అయితే.. వీవీప్యాట్‌లు లెక్కించాల్సి వస్తే.. అన్నీ ఒకేసారి ఓపెన్ చేయరు. ఒకదాని తర్వాత మరొకటి తెరుస్తారు. దీనివల్ల ఫలితం ఆలస్యమవుతుంది. ఇలా ఎంతో పకడ్బందీగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
ఏపీలో మార్పు ఖాయం- కూటమికి పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్ - andhra pradesh exit polls 2024