Fire Accident At Gamezone : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిన్నారులు సహా 22 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఇంకా పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నగరంలోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటల్లో చిక్కుకున్న కొందరిని కాపాడారు పోలీసులు. గాయపడిన వారిని ఆస్పత్రకి తరలించారు. చెలరేగుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. వేసవి సెలవుల కారణంగా గేమ్‌జోన్‌లో ఘటనా సమయంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాజ్‌కోట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధవల్ హరిపరా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
సిటీలో మిగతా గేమ్ జోన్లు బంద్!
పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు చెప్పారు. నగరంలోని మిగతా గేమింగ్ జోన్లకు ఆదేశాలు పంపారు రాజ్‌కోట్ సీపీ. అన్ని సెంటర్లను మూసి వేయాలని ఆదేశించారు.
సీఎం స్పందన!
ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా తక్షణమే ఘటనా స్థలికి చేరుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. "మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఘటనను ఇప్పుడే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) దర్యాప్తు చేయనుంది" అని మరో ట్వీట్ చేశారు సీఎం భూపేంద్ర.
మోదీ సంతాపం
మరోవైపు, అగ్నిప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. "రాజ్‌కోట్‌లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. నా ఆలోచనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉన్నాయి. క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నా. స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి కృషి చేస్తోంది" అని ఎక్స్‌లో మోదీ ట్వీట్ చేశారు. భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.