Mall Entry Denied To Farmer : కర్ణాటక రాజధాని బెంగళూరులోని మాల్‌లో ఓ రైతుకు అమానవీయ ఘటన ఎదురైంది. ధోతీ ధరించారన్న కారణంతో ఆ రైతును మాల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ విషయం వెలుగులోకి రాగానే మాల్ ఎదుట రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతు సంఘాల నాయకులు, ఆ రైతుకు క్షమాపణలు చెప్పాలని భద్రతా సిబ్బందిని డిమాండ్ చేశారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది రైతుకు క్షమాపణలు చెప్పారు.
ఇదీ జరిగింది
హవేరికి చెందిన నాగరాజు తన తండ్రి ఫకీరప్పతో కలిసి సినిమా చూసేందుకు మంగళవారం బెంగళూరులోని జీటీ మాల్‌కు వెళ్లారు. అయితే ఫకీరప్ప ధోతీ ధరించిన కారణంగా మాల్ భద్రత సిబ్బంది ఆయన్ను అడ్డగించి లోపలికి వెళ్లనీయలేదు. ఆయన ప్యాంట్ ధరించి వస్తే లోపలికి అనుమతిస్తామని సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రైతు సంఘాల నాయకులు బుధవారం ఉదయం మాల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ రైతుకు, అతడి కుమారుడికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే వేలాది మంది రైతులతో నిరసనకు దిగుతామని రైతు నేత కురుబూర శాంతకుమార్ హెచ్చరించారు. దీంతో ఆ భద్రతా సిబ్బంది వారికి క్షమాపణలు చెప్పారు.
అదే మాల్‌లో రైతుకు సన్మానం
రైతు సంఘాల నిరసనతో భద్రత సిబ్బంది తమ తప్పును ఒప్పుకున్నారు. ఇక నిరసన అనంతరం నిర్వాహకులు ఫకీరప్పను మాల్‌లోకి ఆహ్వానించి ఆయనను ఘనంగా సన్మానించారు. ఇక ఇదే సమయంలో ధోతీ ధరించిన మరో వ్యక్తి మాల్లోనికి వెళ్తుండగా, ఎలాంటి తనిఖీ చేయకుండా అతడిని భద్రత సిబ్బంది లోపలికి అనుమతించింది.