Rakesh Tikait Warns Salman Khan : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ మరోసారి కోరారు. ఇది ఒక వ్యక్తి సమస్య కాదని, ఒక తెగ నమ్మకాలకు సంబంధించినది అని తెలిపారు. ఇప్పటికైనా బిష్ణోయ్‌లకు సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్లి, గతంలో తాను చేసిన తప్పునకు సల్మాన్ ఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. దీని వల్ల వారిలో ఆయనపై ఉన్న కోపం కొంతైనా పోతుందన్నారు. లేదంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాకేశ్ టికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి.
"గత 12 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోంది. ఈ విషయాన్ని క్షమాపణలు చెప్పడం ద్వారా పరిష్కరించుకోగలిగితే ఆ పని చేయాలి. వారు తమ ప్రాంతంలో పర్యావరణాన్ని, వన్యజీవులను జాగ్రత్తగా చూసుకుంటారు. సినీ నటుడే జంతువును వేటాడినట్లు వారు భావిస్తున్నారు. సంఘం(బిష్ణోయ్ తెగ) ప్రజల ముందు లేదా వారి దేవాలయం ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు కోరారు. అంతటితో ఆ విషయం సమసిపోతుంది."
- రాకేశ్ టికాయత్, రైతు నాయకుడు
ఇదీ కథ
రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ నటుడిని టార్గెట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 'ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా' అంటూ నాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పోస్ట్ పెట్టాడు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్నింగ్ నిజమే అనిపిస్తోంది. గత కొంత కాలంగా సల్మాన్‌ను టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్, పక్కా ప్రణాళికతో నటుడి హత్యకు కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం పాకిస్థాన్ నుంచి ఆయుధాలను తెప్పించింది కూడా! మరోవైపు, అతడి కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 15-20 మంది నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.