Droupadi Murmu On Kolkata Doctor Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన అని, తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం కూడా అనుమతించదని తెలిపారు. ఈమేరకు పీటీఐ వార్తా సంస్థకు చెందిన ఎడిటర్లతో చర్చించి, తాను రాసి సంతకం చేసిన ప్రత్యేక వ్యాసంలో వ్యాఖ్యానించారు.
ఓవైపు నిరసనలు- నేరస్థులు మాత్రం!
''ఒకవైపు విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు సహా అనేక మంది కోల్‌కతాలో నిరసనలు చేపడుతుంటే మరోవైపు నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. బాధితుల్లో అనేక మంది చిన్నపిల్లలూ ఉన్నారు. ఆకృత్యాలకు ఏ నాగరిక సమాజం కూడా తమ కుమార్తెలను, సోదరీమణులను ఎప్పటికీ బలి ఇవ్వదు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్ల కాలంలో సమాజం ఎన్నో అత్యాచార ఘటనలను మరిచిపోయింది. ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైనది. గత తప్పులను ఎదుర్కొనేందుకు సమాజం భయపడుతోంది. కానీ ఇప్పుడు చరిత్రను సమూలంగా మార్చేందుకు సమయం ఆసన్నమైంది. సమగ్రమైన రీతిలో ఈ సమస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దాం'' ఆమె పేర్కొన్నారు.
ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే!
ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ద్రౌపదీ ముర్ము మాట్లాడారు. ఆ సమయంలో వారు భవిష్యత్తులో నిర్భయ తరహా ఘటన పునరావృతం కాబోదని హామీ ఇవ్వగలరా అని తనను అడిగినట్లు చెప్పారు. నీచమైన ఘటనల విషయంలో సమాజం తనను తాను నిష్పాక్షికమైన ఆత్మపరిశీలన చేసుకోవాలని ముర్ము తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు తానుగా కొన్ని కష్టమైన ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. "మనం ఎక్కడ తప్పు చేశాం? లోపాలను సరిచేయడానికి మనం ఏమి చేయవచ్చు? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనకపోతే, మన జనాభాలో సగం మంది స్వేచ్ఛగా జీవించలేరు" అని ముర్ము తెలిపారు. ఇప్పటికే జరిగిన ఘటనలను గుర్తుంచుకుని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.