Electoral Bonds Supreme Court Case : ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌బీఐ సమర్పించిన వివరాలు అసంపూర్తిగా ఉండటంపై అసహనం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, బాండ్ల నంబర్లు లేకపోవడం వల్ల ఎవరు ఎవరికిచ్చారో స్పష్టత లేదని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నప్పటికీ, అందుకు విరుద్ధంగా వ్యవహరించిన SBIపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 11న ఎలక్టోరల్ బాండ్ల కేసులో జారీ చేసిన ఆర్డర్‌లోని ఆపరేటివ్ పోర్షన్‌ను సవరించాలని కోరుతూ ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది.
'శనివారంలోగా వెబ్సైట్లో ఉండాలి'
ఎన్నికల సంఘం సీల్డ్ కవర్లో సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్కానింగ్, డిజిటైలైజేషన్ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత అసలు పత్రాలను ఈసీకి తిరిగి ఇస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అనంతరం వీటిని శనివారంలోగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఈసీఐకి సూచించింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎస్‌బీఐ తమకు సమర్పించలేదని ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.
ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్ ఫైర్
ఎన్నికల సంఘం ప్రకటించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ అవినీతి వ్యూహాలను ఎలక్టోరల్ బాండ్ల డేటా బహిర్గతం చేసిందని ఆరోపించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. కంపెనీల నుంచి విరాళలు స్వీకరించి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని విమర్శించారు. యూనిక్ ఐడీ నంబర్లను వెల్లడించాలని, దాని వల్ల దాతలు, గ్రహీతలను గుర్తించవచ్చని తెలిపారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సైతం దీనిపై మాట్లాడారు. 2జీ స్కామ్‌లో జరిగిన విధంగా ఎలక్టోరల్ బాండ్ల కేసు విచారణ జరగాలని కోరారు. ఇందుకోసం ఓ సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని తెలిపారు.