Election Commission Notice To AAP : భారతీయ జనతా పార్టీలో చేరాలని కొందరు ప్రైవేటు వ్యక్తులు తనను సంప్రదించారని ఇటీవల ఆప్ నాయకురాలు, దిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిశీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో తాను చేసిన ప్రకటనకు సరైన ఆధారాలు చూపించాలని కోరింది.
'బీజేపీకి చెందిన కొందరు తమ పార్టీలో చేరమని నన్ను సంప్రదించారు. ఈ ప్రతిపాదనను నేను తిరస్కరించాను' అని అతిశీ కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కమలం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆప్ నేత అతిశీ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరాలని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే అతిశీకి నోటీసులు జారీ అయ్యాయి.
'బీజేపీ అనుబంధ సంస్థగా ఈసీ'
మరోవైపు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులపై దిల్లీ మంత్రి అతిశీ స్పందించారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఓ అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. తనకు నోటీసులు రావడానికి గంట ముందే మీడియాకు ఎలా లీకైయిందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్‌పై ఈసీ ఎందుకు స్పందించలేదని అడిగారు. బీజేపీ అభ్యంతకర పోస్టర్లు, హోర్డింగ్‌లపై తాము అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈసీ పంపిన నోటీసులకు తాను సమాధానం ఇస్తానని అతిశీ చెప్పారు.
ఈసీ నోటీసులో ఏముంది?
'మీరు దిల్లీలో అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి నాయకురాలు. పైగా మంత్రి. అలాంటి సమయాల్లో మీలాంటి వారు మీడియా ముందు లేదా బహిరంగ వేదికల నుంచి ఏం చెప్పినా ఓటర్లు నమ్ముతారు. మీ ప్రసంగాల్లో చేసే ప్రకటనలు వారిని ప్రభావితం చేస్తాయి. అయితే బీజేపీలో చేరిక విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవాలని, అందుకు తగిన ఆధారాలు మీ వద్ద ఉన్నాయని మేం భావిస్తున్నాం. వాటిని ఈసీకి అందించాలని కోరుతున్నాం' అని ఎన్నికల సంఘంలోని పోల్ ప్యానెల్ నోటీసులో పేర్కొంది. కాగా, ఏప్రిల్ 8 సోమవారం మధ్యాహ్నానికి మంత్రి ఆతిశీ ఈసీకి సమాధానం ఇవ్వాల్సి ఉంది.
ఆతిశీకి కేంద్రమంత్రి స్ట్రాంగ్ కౌంటర్!
నెలరోజుల వ్యవధిలో బీజేపీలో చేరాలని లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని ఆతిశీ సంచలన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల గట్టి కౌంటర్ ఇచ్చారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌కు చెందిన పలువురు అగ్రనేతల అరెస్టులను ఉద్దేశిస్తూ 'ఆమ్‌ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కేసులో ఇరుక్కుంది. ఈ తరుణంలో ఆమెను మా పార్టీలో చేర్చుకొని ఇబ్బందులు తెచ్చుకోం. ఇక ఆతిశీ వంటి రాజకీయ కార్యకర్తకు మా పార్టీలో చోటులేదు' అని దిల్లీ మంత్రి ఆరోపణలను తిప్పికొట్టారు.
'కేజ్రీవాల్ బరువు తగ్గలేదు'- మంత్రి ఆరోపణలపై తిహాడ్ జైలు క్లారిటీ - Kejriwal Health Controversy