ECI Directions To Political Parties : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగవద్దని సూచించింది. భక్తులు, దైవ సంబంధాలను అవమానించవద్దని ECI స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసే వారమని, ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని ECI హెచ్చరించింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించొద్దని ఆదేశించింది. ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది.
గతంలో నోటీసులు అందుకున్న ఉల్లంఘనులపై ఈసారి కఠిన చర్యలుంటాయని ECI తెలిపింది. ప్రచారంలో పార్టీలు మర్యాద పాటించాలని సూచించింది. ఈ విషయంలో స్టార్ క్యాంపెయినర్లకు ఎక్కువ బాధ్యత ఉందని వెల్లడించింది. వాస్తవాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని సూచించింది. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పింది. మహిళల గౌరవానికి, పరువుకు భంగం కలిగించే హేయమైన వ్యాఖ్యలు చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది. ధ్రువీకరణ కాని, తప్పుదోవ పట్టించే ప్రచార ప్రకటనలను మీడియాలో ఇవ్వకూడదని వార్తా కథనాల మాటున ప్రచార ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ సూచించింది.
పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం
పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవడానికి ఇదివరకున్న 80 ఏళ్ల అర్హతను కేంద్రం 85 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ఎన్నికల రూల్స్ 1961లోని రూల్ 27ఎ క్లాజ్ (ఇ)ని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఇదివరకు 80 ఏళ్లు నిండిన వయోవృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి వద్దే ఓటు వినియోగించుకునే సౌలభ్యం ఉండేది. ఇకపై 85 ఏళ్లు పైబడిన వారికే ఈ సౌకర్యం వర్తించనుంది.
'ప్రచారంలో చిన్నారులను భాగం చేయొద్దు'
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని ఈసీ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. బాలకార్మిక చట్టాలు, నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసే బాధ్యత ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చే హామీలు సాధ్యాసాధ్యాలు గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సీఈసీ రాజీవ్‌కుమార్ కొద్దిరోజుల క్రితం తెలిపారు.
బ్యాలెట్ టు ఈవీఎం-75 ఏళ్ల ఎలక్షన్ కమిషన్ ప్రయాణం- ఆసక్తికర విషయాలివే!